Updated : 23 Jun 2022 19:05 IST

EPS Vs OPS: అన్నాడీఎంకేలో తారస్థాయికి ఆధిపత్య పోరు..! పన్నీర్‌సెల్వంపై నీళ్ల బాటిళ్లతో దాడికి యత్నం

రసాభాసగా మారిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం

చెన్నై: అన్నాడీఎంకేలో (AIADMK) పార్టీలో నాయకత్వ వ్యవహారం తారాస్థాయికి చేరుకుంది. గురువారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో పన్నీర్‌సెల్వం (OPS), ఎడప్పాడి పళనిస్వామి (EPS) వర్గాల మధ్య మరింత వివాదం చెలరేగింది. పార్టీలో ఏక నాయకత్వాన్ని కోరుకుంటోన్న పళనిస్వామికి సీనియర్‌ నేతలు మద్దతు తెలపడంతో పన్నీర్‌సెల్వం వర్గం వ్యతిరేకించింది. ఇదే సమయంలో వేదికపైకి చేరుకున్న మాజీ ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంపై పళనిస్వామి మద్దతుదారులు నీళ్ల బాటిళ్లతో దాడికి యత్నించడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. అయితే, పళనిస్వామి (EPS) ప్రతిపాదించిన ఏక నాయకత్వంపై జనరల్‌ కౌన్సిల్‌ ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని.. కేవలం ముందస్తుగా నిర్ణయించిన తీర్మానాలనే ఆమోదించాలంటూ మద్రాస్‌ హైకోర్టు ఆదేశించిన కొన్ని గంటలకే పార్టీ సమావేశం మళ్లీ రసాభాసగా మారడం గమనార్హం.

గతంలో ప్రతిపాదించిన తీర్మానాలను ఆమోదించేందుకు అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశం నేడు మరోసారి భేటీ అయ్యింది. ఇదే సమయంలో అగ్రనేతలు ఈపీఎస్‌, ఓపీస్‌లు తమ మద్దతుదారులతో అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాల నినాదాలు, అరుపుల మధ్యే తీర్మానాలను చదవడం మొదలుపెట్టారు. అయితే, ఈ తీర్మానాలన్నింటినీ జనరల్‌ కౌన్సిల్‌ తోసిపుచ్చుతోందంటూ పార్టీ సీనియర్‌ నేత షణ్ముగం ప్రకటించారు. మరో సీనియర్‌ కేపీ మునుస్వామి మాట్లాడుతూ.. తీర్మానాలన్నింటినీ సభ్యులు తిరస్కరించారని.. ఏక నాయకత్వమే వారి ప్రధాన డిమాండ్‌ అని ప్రకటించారు. అదే సమయంలో వేదికపైకి చేరుకున్న పన్నీర్‌సెల్వంపై కొందరు వాటర్‌ బాటిళ్లను విసిరారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను బయటకు తీసుకెళ్లిపోయారు.

ఇదిలాఉంటే, తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత పార్టీ నాయకత్వం విషయంలో పార్టీలో విభేదాలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా పార్టీలో ఏక నాయకత్వాన్ని సమర్థిస్తోన్న పళనిస్వామి.. పార్టీ జనరల్‌ సెక్రటరీగా ఎన్నికయ్యేందుకు గతకొన్ని రోజులుగా పావులు కదుపుతున్నారు. మరోవైపు పన్నీర్‌సెల్వం మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఎంజీఆర్‌, జయలలిత వంటి అగ్రనేతలతో పనిచేసిన వారికి పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తూ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో పార్టీలో ఇప్పటివరకు ఉన్న ద్వంద్వ నాయకత్వాన్నే కొనసాగించాలని పట్టుబడుతున్నారు. తాజాగా జరిగిన సమావేశంలో ఏక నాయకత్వం అంశాన్ని మళ్లీ చర్చించడంతో పన్నీర్‌సెల్వం వర్గం ఆగ్రహించారు. ఆయనపై దాడిచేసే క్రమంలో సమావేశాన్ని వాకౌట్‌ చేస్తూ వెళ్లిపోయారు. ఇప్పటివరకు పార్టీ సమన్వయకర్తగా పన్నీర్‌సెల్వం, సంయుక్త సమన్వయకర్తగా ఎడప్పాడి పళనిస్వామి కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని