UP Polls 2022: ఎంఐఎం కొత్త జట్టు.. కూటమిని గెలిపిస్తే ఇద్దరు సీఎంలు!

ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్త కూటమి ఆవిర్భవించింది. మరో ఐదు పార్టీలతో కలిసి ‘భాగీదారీ పరివర్తన్​ మోర్చా’ను ఏర్పాటు చేస్తున్నట్లు......

Published : 23 Jan 2022 01:42 IST

ప్రకటించిన మజ్లిజ్‌ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ

లఖ్‌నవూ: మరికొద్ది వారాల్లో ఉత్తర్​ప్రదేశ్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. యూపీలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో కొత్త కూటమి ఆవిర్భవించింది. మరో ఐదు పార్టీలతో కలిసి ఎంఐఎం ‘భాగీదారీ పరివర్తన్​ మోర్చా’ను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మీడియా సమావేశంలో ప్రకటించారు. తమకు అవకాశం ఇస్తే ఐదేళ్ల కాలంలో ఇద్దరు ముఖ్యమంత్రుల పాలన కొనసాగిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వీరిలో ఒకరు ఓబీసీ వర్గానికి చెందిన వారు మరొకరు దళిత వర్గానికి చెందిన వారికి సీఎంగా అవకాశం ఇస్తామన్నారు. అలాగే ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉంటారని, అందులో ఒకరు ముస్లిం వర్గానికి చెందిన వారిని ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.

భాగీదారీ పరివర్తన్​ మోర్చా కూటమికి ‘జన్‌ అధికార్‌ పార్టీ’ అధ్యక్షుడు బాబు సింగ్ కుష్వాహ నేతృత్వం వహిస్తారని అసదుద్దీన్‌ ప్రకటించారు. తమ కూటమిని గెలిపిస్తే కుష్వాహకు సీఎం బాధ్యతలు అప్పగిస్తామని కూడా ఒవైసీ తెలిపారు. ఐదు పార్టీల సీట్ల పంపకానికి సంబంధించి 95శాతం చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే జాబితాను విడుదల చేస్తామన్నారు.

దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీల కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతున్నామని, వారి అభ్యున్నతికి పాటుపడేందుకే ఈ కూటమి ఏర్పాటు చేసుకున్నామని కుష్వాహ పేర్కొన్నారు. ఇప్పటివరకు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, ఎస్పీ మధ్యే పోటీ ఉంటుందని అందరూ భావిస్తున్నారని, ఇప్పుడు తమ కూటమికి భాజపాకు మధ్యే అసలు పోటీ అని భారత్‌ ముక్తి మోర్చా పార్టీ అధ్యక్షుడు వామన్ మేశ్రమ్ కూటమి ఏర్పాటు సందర్భంగా వ్యాఖ్యానించారు. తమతో ఇంకా ఏ పార్టీ కలిసి వచ్చినా చేర్చుకునేందుకు సిద్ధమని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని