ఆ పార్టీ భాజపాకు B టీమ్‌.. మా టీమ్‌లో చోటులేదు: సంజయ్‌ రౌత్‌

మహారాష్ట్రలోని మహా వికాస్‌ అఘాడీ కూటమిలో చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఎంఐఎం నేత చేసిన వ్యాఖ్యలను శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తోసిపుచ్చారు. ఆ పార్టీకి తమ కూటమిలో చోటు లేదన్నారు.

Published : 20 Mar 2022 01:26 IST

ముంబయి: మహారాష్ట్రలోని మహా వికాస్‌ అఘాడీ కూటమిలో చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఎంఐఎం నేత చేసిన వ్యాఖ్యలను శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తోసిపుచ్చారు. ఆ పార్టీకి తమ కూటమిలో చోటు లేదన్నారు. ఆ పార్టీ భాజపాకు ‘బి’ టీమ్‌ అని ఆరోపించారు. తమను కూటమిలో చేర్చుకుంటే భాజపాను అధికారంలోకి రాకుండా నిలువరించొచ్చంటూ ఎంఐఎం ఎంపీ, ఆ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు ఇంతియాజ్‌ జలీల్‌ ప్రతిపాదించిన నేపథ్యంలో సంజయ్‌ రౌత్‌ ఈ వ్యాఖలు చేశారు.

‘‘ఏఐఎంఐఎంకు భాజపాతో చీకటి ఒప్పందం ఉంది. ఈ విషయం ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో నిరూపితమైంది. ఇప్పటికీ ఆ పార్టీ భాజపాకు ‘బి’ టీమ్‌గానే కొనసాగుతోంది. మూడు పార్టీలతో కూడుకున్న మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వంలో నాలుగో పార్టీకి చోటు లేదు’’ అని రౌత్‌ అన్నారు. కూటమిలోని పార్టీలన్నీ ఛత్రపతి శివాజీ మహరాజ్‌, ఛత్రపతి శంభాజీ మహరాజ్‌లను గౌరవిస్తాయన్నారు. ఎంఐఎం పార్టీ ఔరంగజేబు సమాధి ముందు మోకరిల్లుతుందని విమర్శించారు. హిందుత్వ కోణంలో చూసినప్పుడు శివాజీని అంతమొందించేందుకు ఔరంగజేబు విఫలయత్నం చేశారని గుర్తుచేశారు. అలాంటి పార్టీకి కూటమిలో చోటు లేదని పేర్కొన్నారు. అలాగే, కూటమికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ భాజపా ఎంపీ రావు సాహెబ్‌ ధన్వే చేసిన వ్యాఖ్యలనూ రౌత్‌ కొట్టి పారేశారు. ఆయనకు ఇంకా హోలీ మత్తు దిగినట్లు లేదని, ఆయన ఏం మాట్లాడారో ఆయనకే గుర్తుండదని వ్యాఖ్యానించారు.

ఇంతకీ జలీల్‌ ఏమన్నారు..?

భాజపాను ఓడించేందుకు శివసేనకు శక్తి సరిపోవడం లేదని, అందుకే కాంగ్రెస్‌, ఎన్సీపీని కలుపుకొని వెళుతోందని ఇంతియాజ్‌ జలీల్‌ అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న మూడు చక్రాల బండికి (ఆటో).. ఎంఐఎం అనే నాలుగో చక్రం తగిలిస్తే ఒక పూర్తిస్థాయిగా కారుగా మారుతుందన్నారు. తద్వారా భాజపాను ఓడించడం సులువు అవుతుందని చెప్పారు. భాజపాకు ఎంఐఎం ‘బి’ టీమ్‌గా వ్యవహరిస్తోందంటూ వస్తున్న ఆరోపణలనూ ఆయన తోసిపుచ్చారు. ముస్లిం ఓట్లలో చీలిక తెస్తూ భాజపా విజయానికి సహకరిస్తున్నామని అంటున్నారని, దాని బదులు భాజపాను ఓడించేందుకు కలిసి పనిచేద్దామని చెబుతున్నామని జలీల్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని