AIMIM: సిన్హాకే మజ్లిస్‌ మద్దతు.. అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటన

AIMIM to vote for Yashwant Sinha: రాష్ట్రపతి ఎన్నికల్లో (presidential polls) ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థికి మజ్లిస్‌ పార్టీ మద్దతు ప్రకటించింది.

Published : 27 Jun 2022 21:51 IST

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల్లో (presidential polls) ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థికి మజ్లిస్‌ పార్టీ మద్దతు ప్రకటించింది. వచ్చే నెల జరగబోయే ఎన్నికల్లో యశ్వంత్‌ సిన్హాకే ఓటేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో మద్దతు విషయమై తనతో యశ్వంత్‌ సిన్హా మాట్లాడారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంఐఎంకు లోక్‌సభలో ఇద్దరు ఎంపీలు ఉన్నారు. అలాగే తెలంగాణలో ఏడుగురు, బిహార్‌లో ఐదుగురు, మహారాష్ట్రలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా జులై 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో సిన్హాకు అనుకూలంగా ఓటు వేయనున్నారు.

ఇప్పటికే తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస కూడా ఉమ్మడి సిన్హాకే జై కొట్టింది. సోమవారం జరిగిన యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ కార్యక్రమానికి కూడా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. దీంతో తెలంగాణలోని రెండు పార్టీలు ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్‌ సైతం విపక్షాల అభ్యర్థికి మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణలో భాజపా మినహా మూడు ప్రధాన పార్టీలు విపక్షాల అభ్యర్థి వైపు నిలిచాయి. మరోవైపు ఏపీలో అధికారంలో ఉన్న వైకాపా మాత్రం ఎన్డీయే బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది మర్ముకు మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ నేతలు సైతం నామినేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. తెదేపా మాత్రం ఇప్పటి వరకు తన వైఖరి తెలియజేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని