Published : 22 Feb 2022 18:58 IST

UP Polls: రాజ్యాంగాన్ని కాదు.. ఉగ్రవాదుల్ని రక్షిస్తామని ప్రమాణం చేశారు: నడ్డా ఫైర్‌

డియోరియా: యూపీలో ఇప్పటికే మూడు విడతల్లో పోలింగ్‌ ముగియగా.. మరో నాలుగు దశల ఎన్నికల పోలింగ్‌కు ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో అక్కడి రాజకీయ వాతావరణం హీటెక్కింది. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌పై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అఖిలేశ్.. రాజ్యాంగాన్ని కాదు ఉగ్రవాదుల్ని రక్షిస్తామంటూ దేవుడి వద్ద ప్రమాణం చేశారంటూ ధ్వజమెత్తారు. డియోరియాలోని రుద్రాపూర్‌లో ఎన్నికల ప్రచార సభలో నడ్డా మాట్లాడారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు పలు ఉగ్రదాడుల్లో నిందితులుగా ఉన్నవారిపై కేసుల్ని అఖిలేశ్‌ ఉపసంహరించుకున్నారని ఆరోపించారు. ఎవరైనా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని దేవుడి వద్ద ప్రమాణం చేస్తారు కానీ.. అఖిలేశ్‌ మాత్రం ఉగ్రవాదుల్ని రక్షిస్తానని ప్రమాణం చేశారంటూ విరుచుకుపడ్డారు. అహ్మదాబాద్‌ బాంబు పేలుళ్ల కేసులో గత శుక్రవారం కోర్టు 38మంది మరణశిక్ష విధించగా.. వారిలో సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్త మహమ్మద్‌ సైఫ్‌ తండ్రి షాదాబ్‌ అహ్మద్‌ కూడా ఉన్నారన్నారు. మరోవైపు, కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాపైనా నడ్డా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని ఆమె పనికిమాలిన అంశంగా పేర్కొనడాన్ని తప్పుబట్టారు. 

‘‘ఉగ్రవాద అంశాన్ని ప్రియాంక గాంధీ పనికిరానిదిగా పేర్కొన్నారు. ఆమె తండ్రి రాజీవ్‌ గాంధీ కూడా ఉగ్రదాడిలో మరణించారు. కానీ ఆమెకు ఈ అంశం పనికిరానిదట. రాష్ట్రంలో గూండా రాజ్‌, మాఫియారాజ్‌ను యోగి ఆదిత్యనాథ్‌ అంతం చేశారు.. దేశ వ్యతిరేక శక్తుల్ని జైళ్లలో పెట్టారు. ఐదేళ్ల క్రితం అజంఖాన్‌, ముఖ్తార్‌ అన్సారీ, అతిక్‌  అహ్మద్‌ ఉగ్రకార్యకలాపాలు నిర్వహించేవారు. కానీ, గత ఐదేళ్లలో వీరంతా జైలులోనే ఉన్నారు. అందువల్ల భాజపాకు ఓటేసి యోగిని గెలిపించండి. యోగి ఆదిత్యనాథ్‌ పాలనలో రాష్ట్ర ప్రజలు దీపావళి, హోలీ వంటి పండుగలను అత్యంత ఉత్సాహంగా జరుపుకొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో గతంలో కూడా తరచూ దీపావళి వచ్చేది. కానీ అయోధ్యలో దీపోత్సవ్‌ ఎందుకు జరగలేదు? గతంలోనూ శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చేది.. కానీ మథురను ముస్తాబు చేసేవారు కాదెందుకు? దేవ దీపావళికి వారణాసిని అలంకరించేవారు కాదెందుకు? కానీ, భాజపా పాలనలోనే దీపోత్సవ్‌ వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీ ఓటుకు ఉన్న శక్తి ఇదే. అభివృద్ధి పనులు చేశామని చెప్పి ప్రజల్లోకి వెళ్లే ధైర్యం సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ నేతలకు లేదు. కానీ భాజపా నేతలు మాత్రమే తాము ఏం చెప్పామో అది చేశామని ధైర్యంగా గుండెలపై చేయి వేసుకొని చెప్పగలరు’’ అని నడ్డా అన్నారు.

ఇవి సామాన్యమైన ఎన్నికలేం కాదు: అఖిలేశ్‌

ప్రయాగ్‌రాజ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు సాధారణమైనవేమీ కాదనీ.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేవి.. ఉత్తర్‌ప్రదేశ్‌ తలరాతను మార్చేవని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. కర్చానా నియోజకవర్గంలోని భిర్పూర్‌లో ఎన్నికల ప్రచార భారీ సభలో ఆయన ప్రసంగించారు. తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని అమలుపరిచేందుకు తాను పనిచేస్తానన్నారు. భాజపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగాయని విమర్శించారు. భాజపాలో చిన్న నాయకులు చిన్న అబద్ధాలు, పెద్ద నేతలు పెద్ద పెద్ద అబద్ధాలు చెబుతారంటూ ధ్వజమెత్తారు. యూపీలో తమ పార్టీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైతే యువతకు ఉద్యోగాలు కల్పించి ఖాళీ పోస్టుల్ని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. భాజపా పాలనలో యోగి ఆదిత్యనాథ్‌ పథకాల పేర్లను మార్చి అభివృద్ధిగా చూపించారని ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని