UP Politics: కరోనా వ్యాప్తి కోసమే కరపత్రాలను పంచిపెడుతున్నారు..!

కరోనా వైరస్‌ను వ్యాప్తి చేసేందుకే భాజపా కార్యకర్తలు కరపత్రాలను పంచిపెడుతున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ఆరోపణలు చేశారు.

Published : 29 Jan 2022 02:02 IST

అమిత్‌ షా పై మండిపడ్డ అఖిలేష్‌ యాదవ్‌

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ.. రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. అధికార భాజపాపై సమాజ్‌వాదీ పార్టీ విమర్శలు ఎక్కుపెడుతోంది. తాజాగా మరో ముందడుగు వేసిన ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌.. కరోనా వైరస్‌ను వ్యాప్తి చేసేందుకే భాజపా కార్యకర్తలు కరపత్రాలను పంచిపెడుతున్నారంటూ ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి అమిత్‌ షా కరపత్రాలను పంచిపెట్టడాన్ని తప్పుపట్టిన ఆయన.. ఇలాంటి వాటిని ఎన్నికల సంఘం అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి అమిత్‌ షా ఇటీవల గౌతమ బుద్ధ నగర్‌ జిల్లాలో పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆ సందర్భంగా కరపత్రాలను పంచిపెట్టిన ఆయన.. నోటితో వాటిని తడిమారు. ఆ చర్యను తప్పుబట్టిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సూర్య ప్రతాప్‌ సింగ్‌.. ఆ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. అంతేకాకుండా ఇటువంటి చర్యల వల్లే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోందని విమర్శించారు. తాజాగా దీనిపై స్పందించిన ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌.. కరోనా వ్యాప్తి చేసేందుకే భాజపా కార్యకర్తలు కరపత్రాలను పంచిపెడుతున్నారని దుయ్యబట్టారు. ఇటువంటి వాటికి ఎన్నికల సంఘం అడ్డకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రతికూల రాజకీయాలకు ముగింపు పలికేందుకు ఎస్‌పీ-ఆర్‌ఎల్‌డీ జట్టు కట్టాయని శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అఖిలేష్‌ యాదవ్‌ వెల్లడించారు.

ఇక అఖిలేష్‌ యాదవ్‌ పార్టీ (ఎస్పీ) అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్లీ గూండా రాజ్యమే వస్తుందని అమిత్‌ షా ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌ పార్టీ రెండూ వారసత్వ, కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయన్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై విమర్శలు చేస్తున్న అఖిలేష్‌కు దాని గురించి మాట్లాడే హక్కులేదని అమిత్‌ షా విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని