
UP election 2022:మా పార్టీలోకి రండి.. యోగిపై పోటీ చేయండి
గోరఖ్‌పుర్ భాజపా సిట్టింగ్ ఎమ్మెల్యేకు అఖిలేష్ ప్రతిపాదన
లఖ్‌నవూ: అయోధ్య, మథురలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పోటీ చేస్తారని చెప్పిన భాజపా.. ఆయనకు చివరకు గోరఖ్‌పుర్ సీటిచ్చి ముందే ఇంటికి పంపిందంటూ ఎద్దేవా చేసిన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్.. సోమవారం ఓ వినూత్న ప్రతిపాదనతో ముందుకొచ్చారు. గోరఖ్‌పుర్ అర్బన్ ప్రస్తుత భాజపా సిట్టింగ్ ఎమ్మెల్యే రాధా మోహన్ దాస్ అగర్వాల్‌కు అవమానం జరిగిందని, ఆయనకు ఆసక్తి ఉంటే తమ పార్టీలో చేరొచ్చని అన్నారు. టికెట్ కూడా ఇస్తామని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గం నుంచే యోగి.. భాజపా తరఫున పోటీ చేయనున్నారు. ఇటీవల భాజపా నుంచి ముగ్గురు మంత్రులు ఐదుగురు ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరారు. దీంతో ఇక ఆ పార్టీ నుంచి ఎవరొచ్చినా తీసుకోమని అఖిలేష్ చెప్పారు. అయితే రాధా మోహన్ విషయంలో మాత్రం సడలింపు వైఖరి అవలంబిస్తామన్నారు. ఆయన తమ పార్టీలో చేరతానంటే గోరఖ్‌పుర్ అభ్యర్థిగా ప్రకటిస్తామని తెలిపారు. 2002 నుంచి రాధామోహన్.. గోరఖ్‌పుర్ అర్బన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ‘‘యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార సమయంలోనూ అగర్వాల్‌ను చూశాను. ఆయనకు కుర్చీ కూడా దొరకలేదు. నిలబడే ఉన్నారు. భాజపా ప్రభుత్వంలో ఆయన అవమానాలకు గురయ్యారు’’ అని యాదవ్ అన్నారు. దీనిపై స్పందించేందుకు అగర్వాల్ నిరాకరించారు. భాజపా ప్రతినిధి హరీశ్ చంద్ర శ్రీవాస్తవ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘భాజపాలో అందరూ క్రమశిక్షణ గల సైనికులు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తారు. గోరఖ్‌పుర్‌లో.. సీఎం యోగి భాజపా అభ్యర్థి. అక్కడ ఎస్పీకి బలమైన అభ్యర్థి లేరు. అక్కడే కాదు చాలా స్థానాల్లో లేరు. అందుకే అసహనంతో అఖిలేష్ పనికిరాని వ్యాఖ్యలు చేస్తున్నారు’’ అని శ్రీవాస్తవ మండిపడ్డారు.
పాత్రికేయులకూ పోస్టల్ బ్యాలెట్
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్‌పై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈసీ ద్వారా గుర్తింపు పొందిన పాత్రికేయులు.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని పేర్కొంది. అంతకుముందు.. 80 ఏళ్లు పైబడివారు, దివ్యాంగులు(40శాతం కంటే ఎకువ), కరోనా సోకినవారు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు వేయడానికి ఈసీ ఆమోదం తెలిపింది. ఈ జాబితాకు అదనంగా పాత్రికేయులను చేర్చింది. వీరితో పాటుగా ఎన్నికల తేదీల్లో విధులు నిర్వహించే ఇతర అత్యవసర విభాగాల సిబ్బందికి ఈ సదుపాయం కల్పించింది.