UP Polls: ఈడీ, సీబీఐ వచ్చినా ‘సైకిల్‌’ ఆగదు: అఖిలేశ్‌

తమ పార్టీ నేతల ఇళ్లపై ఐటీ సోదాలు జరపడంపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ మండిపడ్డారు. అధికార భాజపా కేంద్ర దర్యాప్తు........

Published : 18 Dec 2021 16:51 IST

లఖ్‌నవూ: తమ పార్టీ నేతల ఇళ్లపై ఐటీ సోదాలు జరపడంపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ మండిపడ్డారు. అధికార భాజపా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రజల్ని భయపెడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ రూట్‌లోనే భాజపా కూడా వెళ్తోందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్‌ చరిత్రను చూసినట్లయితే.. ఆ పార్టీ కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించి ప్రతిపక్షాల్ని భయపెట్టేదని, ఇప్పుడు భాజపా కూడా అదే పనిచేస్తోందని గుర్తుచేశారు. యూపీ ప్రజలంతా విపక్షం వైపే ఉన్నారన్నారు. ఓడిపోతామనే భయం భాజపాలో పెరిగిపోతున్న కొద్దీ.. ప్రతిపక్షాలపై దాడులు కూడా పెరుగుతాయన్నారు. ఏం జరిగినా సమాజ్‌వాదీ పార్టీ రథయాత్ర, ఇతర కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగిస్తామని స్పష్టంచేశారు.  ‘‘ఇప్పటికైతే ఐటీ శాఖ వచ్చింది.. తర్వాత ఈడీ వస్తుంది.. సీబీఐ వస్తుంది. కానీ సైకిల్‌ (సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు) మాత్రం ఆగదు. ఇదే వేగంతో ముందుకెళ్తాం. యూపీలో భాజపాను తుడిచిపెట్టుకుపోయేలా చేస్తాం. యూపీ ప్రజలు తెలివిలేనివాళ్లేం కాదు. రాజీవ్‌ రాయ్‌ ఇంటిపై నెల ముందు ఎందుకు సోదాలు జరపలేదు? ఇప్పుడే ఎందుకు? ఎన్నికలు దగ్గరపడ్డాయనా?’’ అని ప్రశ్నలు సంధించారు.

సోషలిజంతోనే రామరాజ్యం!

యూపీలో రామరాజ్యం తీసుకొస్తామంటూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడంలో కమలనాథులు విఫలమయ్యారని మండిపడ్డారు. భాజపా రామరాజ్యం తీసుకొస్తామని చెబుతోంది.. కానీ సోషలిజం మార్గంలోనే రామరాజ్యం సాధ్యమన్నారు. సోషలిజం వస్తేనే రామరాజ్యం వస్తుందని అఖిలేశ్‌ అభిప్రాయపడ్డారు.

మరోవైపు, ఇంకొన్ని నెలల్లో యూపీ ఎన్నికలు జరగనున్న వేళ ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నేతల ఇళ్లపై ఆదాయపు పన్ను అధికారులు సోదాలు జరపడం కలకలం రేపింది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడైన ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్‌ రాయ్‌కి చెందిన మావూలోని నివాసంలో శనివారం ఐటీ అధికారులు సోదాలు జరిపారు. అంతేకాకుండా అఖిలేశ్‌ కుటుంబానికి మంచి పట్టున్న మెయిన్‌పురిలో మరో ఎస్పీ నేత ఇంట్లోనూ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.

Read latest Political News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని