Akhilesh Yadav: అప్పట్లో నా సభకు 25 మందే వచ్చారు..!

పంజాబ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్‌ భద్రతాలో చోటుచేసుకున్న వైఫల్యంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ స్పందించారు.

Published : 08 Jan 2022 01:25 IST

ప్రధాని భద్రతా వైఫల్యంపై అఖిలేష్‌ యాదవ్‌ ఎగతాళి

లఖ్‌నవూ: పంజాబ్‌లో ప్రధాని మోదీ కాన్వాయ్‌ నిలిచిపోవడంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ స్పందించారు. ఫిరోజ్‌పుర్‌ బహిరంగ సభకు చేరుకోవడానికి ప్రధానమంత్రిని అక్కడ నిరసన చేస్తున్న రైతులు వెళ్లనివ్వాల్సి ఉందన్నారు. వారు వెళ్లనీయకపోవడంతో బహిరంగ సభలో ఖాళీ కుర్చీలు చూసుకునే అవకాశం ప్రధాని కోల్పోయారని వ్యంగాస్త్రాలు విసిరారు. ఈ సందర్భంగా గతంలో తాను పాల్గొన్న ఓ సభకు కేవలం 25మందే వచ్చారని.. మోదీ కూడా అలాగే ప్రసంగిస్తే బాగుండేదని చెప్పుకొచ్చారు.

‘ఝార్ఖండ్‌లోని కోడెర్మాలో ఓసారి నాకు కూడా ఇలాంటి పరిణామమే ఎదురయ్యింది. నేను వెళ్లిన సభకు 25 మంది మాత్రమే వచ్చారు. దీంతో పార్టీ నేతలు నన్ను ప్రసంగించకుండా గంటల తరబడి అడ్డుకున్నారు. అయినప్పటికీ 25 మందిని ఉద్దేశించే నేను ప్రసంగించాను’ అంటూ తనకు ఎదురైన ఘటనను అఖిలేష్‌ యాదవ్‌ వివరించారు. అందుకే పంజాబ్‌లో నిరసన చేపట్టిన ప్రజలు, రైతులు కూడా సభావేదిక వద్దకు మోదీని అనుమతించాల్సింది. అక్కడ ఉన్న ఖాళీ కుర్చీలను చూసి ప్రధాని సంతోషించేవారు. నా మాదిరిగానే మోదీ కూడా ఖాళీ కుర్చీలను ఉద్దేశించి ప్రసంగించేవారు’’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. కనీసం అప్పుడైనా సాగు చట్టాలను ఎందుకు తెచ్చారు? ఎందుకు రద్దు చేశారో చెప్పేవారన్నారు. సభ రద్దుతో దేశప్రజలకు అది తెలియకుండా పోయిందని.. అందకు చింతిస్తున్నానని అఖిలేష్‌ యాదవ్‌ చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని