UP polls 2022: అప్పుడు నల్లజెండాలతో నిరసన...ఇప్పుడు టికెట్‌..

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కాన్వాయ్‌ని అడ్డుకొని.. ప్రభుత్వానికి వ్యకతిరేకంగా నల్ల జెండాలు ప్రదర్శించి రాష్ట్ర దృష్టిని తనవైపు తిప్పుకున్న ఓ యువతికి ఎమ్మెల్యే టికెట్‌ దక్కింది......

Published : 02 Feb 2022 18:52 IST

పోటీ చేస్తున్న అతిపిన్న వయస్కురాలు, విద్యార్థి నేత పూజా శుక్లా

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కాన్వాయ్‌ని అడ్డుకొని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల జెండాలు ప్రదర్శించి రాష్ట్ర దృష్టిని తనవైపు తిప్పుకున్న ఓ యువతికి ఎమ్మెల్యే టికెట్‌ దక్కింది. నిరసన అనంతరం అరెస్టు.. విడుదల.. ఆపై స్టూడెంట్‌ లీడర్‌గా కీలకంగా ఎదిగిన 25 ఏళ్ల పూజ శుక్లాకు సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌ ఇచ్చింది. లక్నో నార్త్ నుంచి బరిలో ఉన్న ఆమె.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి పిన్న వయస్కురాలిగా నిలవడం విశేషం.

ఎమ్మెల్యే టికెట్‌ దక్కడంపై పూజా జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. అప్పటి నిరసనలకు సంబంధించిన ఘటనలను గుర్తుచేసుకున్నారు. ‘2017 జూన్‌ 7న లఖ్‌నవూ యూనివర్సిటీలో జరిగే హిందీ స్వరాజ్‌ దివస్‌కు హాజరయ్యేందుకు వస్తున్న సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను సమాజ్ వాదీ విద్యార్థి విభాగం అడ్డుకుంది. మా వెంట ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్‌ సభ్యులు, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు కూడా ఉన్నారు. నల్ల జెండాలు చేతబూని రోడ్డుపై కూర్చుని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపాం. అప్పుడే మమ్మల్ని అరెస్టు చేసి ఆ మరుసటి రోజు జైలుకు తరలించారు’ అని పూజ పేర్కొన్నారు.

సమస్యలపై పోరాటం

‘మేము శాంతియుతంగానే నిరసన తెలుపుతున్నప్పటికీ మమ్మల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఈ అరెస్టుతో.. సరైన అంశాలపై పోరాడాలనే దృక్పథం నాలో మరింత నాటుకుపోయింది’ అని తెలిపారు. అరెస్టు తర్వాత 20 రోజులకు విడుదలైన పూజ.. సమాజ్ వాదీ విద్యార్థి విభాగానికి ఐకాన్‌లా మారారు. పలు సమస్యలపై పోరాడారు. పార్టీ విద్యార్థి విభాగం బలోపేతానికి కృషి చేశారు. అయితే ముఖ్యమంత్రికి నిరసన తెలియజేసినందుకు గాను ఆమెతోపాటు పలువురి అడ్మిషన్లను లఖ్‌నవూ యూనివర్సిటీ నిరాకరించింది. దీంతో నిరాహార దీక్ష చేపట్టిన పూజ.. అధికారులు దిగొచ్చేలా చేసింది. ఆ విద్యార్థులందరికి ప్రవేశం దక్కేలా చేశారు.

సామాజిక విలువలకు దగ్గరగా ఎస్పీ

సమాజ్‌ వాదీనే ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నకు పూజా శుక్లా బదులిస్తూ ములాయం సింగ్ యాదవ్ రాజకీయ పోరాటం, అఖిలేశ్‌ యాదవ్ విధానాలు ఆకట్టుకున్నాయన్నారు. ‘విద్యార్థి రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండే నేను.. సామాజిక విలువలకు ఎస్పీ దగ్గరగా ఉందని భావిస్తాను. భాజపా, దాని మిత్రపక్షాల్లో ఇది ఇసుమంతైనా కనిపించదు’ అని పేర్కొన్నారు. యువత, విద్యార్థుల హక్కుల కోసం ఇకపై కూడా పోరాటం కొనసాగిస్తానని వెల్లడించారు.

అప్పుడే దేశం అభివృద్ధి వైపు పయనిస్తుంది

విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని శుక్లా ఈ సందర్భంగా కోరారు. ‘విద్య పేరుతో యువతను, ముఖ్యంగా విద్యార్థులను రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నారు. ఈ పద్ధతి మారాలి. రాజకీయంగా అవగాహన ఉన్న విద్యార్థి మాత్రమే మంచి నాయకుడిని ఎన్నుకోగలడు. ఇలాంటి యువతే దేశ రాజకీయాలను సమూలంగా మార్చేసి దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుంది’ అని పేర్కొన్నారు. పౌరసత్వ చవరణ చట్టానికి వ్యతిరేకంగానూ ఆమె పలుమార్లు తన గళాన్ని విప్పారు. ప్రస్తుతం తాను పోటీలో ఉన్న లక్నో నార్త్‌ నియోజకవర్గంలో ముమ్మర ప్రచారంలో నిమగ్నమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని