Akhilesh Yadav: భాజపాలో వారసత్వ రాజకీయాలపై అఖిలేష్‌ కౌంటర్‌!

భాజపా వారసత్వ రాజకీయాలు లేవా..? అని ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి భాజపాలో కొందరి సీనియర్‌ నేతల పేర్లను వెల్లడించారు.

Updated : 29 Nov 2022 16:35 IST

లఖ్‌నవూ: దేశంలో వారసత్వ రాజకీయాలు (Dynasty Politics) లేకుండా తమ పార్టీ మాత్రమే పనిచేస్తుందని భాజపా ప్రచారం చేసుకోవడంపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ కూడా భాజపా (BJP) వారసత్వ రాజకీయాలపై విమర్శలు గుప్పించారు. భాజపా నేతల కుమారులు, కుమార్తెలు పార్టీలో కొనసాగుతున్నారని పేర్కొంటూ.. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేశారు.

ములాయం సింగ్‌ మరణంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన మెయిన్‌పురి లోక్‌సభకు ఉప ఎన్నిక జరుగుతోంది. అఖిలేష్‌ సతీమణి డింపుల్‌ యాదవ్‌ (Dimple Yadav)ను ఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలిపింది. భాజపా మాత్రం మాజీ ఎస్పీ నేత రఘురాజ్‌ సింగ్‌ను పోటీలో దింపింది. అయితే, ములాయం కోడలు డింపుల్‌ యాదవ్‌ను ఎన్నికల్లో నిలపడంపై భాజపా విమర్శలు మొదలుపెట్టింది. సమాజ్‌వాదీ పార్టీ  కుటుంబ పార్టీ అంటూ ప్రచారం చేస్తోంది. ఇటీవల అక్కడ ప్రచారం నిర్వహించిన యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌.. ఎస్పీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయా కుటుంబాలకు చెందినవారేనన్నారు. ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య కూడా వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని పౌరులు భావిస్తున్నట్లు చెప్పారు.

ఇలా భాజపా నేతలు చేస్తోన్న విమర్శలపై స్పందించిన అఖిలేష్‌.. మరి భాజపాలో కుటుంబ రాజకీయాలు లేవా? అని ప్రశ్నిస్తూ కొందరి నేతల పేర్లను ఉదహరించారు. కర్ణాటక మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్ప, రాజ్‌నాథ్‌ సింగ్‌, రమణ్‌ సింగ్‌, ఖైలాష్‌ విజయ్‌వర్గీయతోపాటు ఇతర సీనియర్‌ నేతలకు చెందిన కుటుంబీకులు, సన్నిహితులు ప్రస్తుతం భాజపాలో ఉన్నారని చెప్పారు. ఇంకా చాలా మంది వారసులు పార్టీలో ఉన్నారని తెలిపారు. ఇదిలా ఉంటే, ఉప ఎన్నికలో భాగంగా మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి డిసెంబర్‌ 5న పోలింగ్‌ జరగనుండగా.. 8వ తేదీన కౌంటింగ్‌ నిర్వహిస్తారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని