Atchannaidu: ఒక్కఛాన్స్‌ ఇస్తే వ్యవస్థలను జగన్‌ తన గుప్పెట్లో పెట్టుకున్నారు: అచ్చెన్న

ఒక్కఛాన్స్‌ కోరితే వైకాపాకు ప్రజలు అవకాశమిచ్చారని.. దీంతో సీఎం జగన్‌ వ్యవస్థలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Updated : 27 Dec 2022 13:49 IST

విజయవాడ: ఒక్కఛాన్స్‌ కోరితే వైకాపాకు ప్రజలు అవకాశమిచ్చారని.. దీంతో సీఎం జగన్‌ వ్యవస్థలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్ర సంపదను సీఎం దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. తెదేపా ఆధ్వర్యంలో ‘ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాద-ప్రజాస్వామ్య పరిరక్షణ’ అంశంపై విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీపీఐ, సీపీఎం, జనసేన, కాంగ్రెస్‌ పార్టీల తరఫున నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీ చేస్తున్నప్పుడు ప్రశ్నించడం మన హక్కు అని చెప్పారు. ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తుంటే పోలీసులు అర్ధరాత్రి వచ్చి అరెస్ట్‌ చేస్తున్నారని ఆరోపించారు. కేసులు పెట్టినా, జైళ్లకు వెళ్లినా ప్రజాసంక్షేమం కోసం పోరాడుతున్నామన్నారు. జగన్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన వైకాపా విధ్వంసం.. ఇప్పటం గ్రామం వరకు సాగిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేసిన ఎమ్మెల్సీకి సన్మానాలా?: సీపీఐ రామకృష్ణ

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కుల కోసం కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. నిరసనలు తెలపకుండా పోలీసులను కాపలా పెడుతున్నారని మండిపడ్డారు. ‘హత్య చేసిన మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేసిన వైకాపా ఎమ్మెల్సీ చిత్రపటానికి పాలాభిషేకాలా? బెయిల్‌పై విడుదలైతే సన్మానాలా?’’ అని నిలదీశారు. అధికారపార్టీకి పోలీసులు లొంగిపోయి వ్యవస్థ పరువు తీస్తున్నారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా అరాచకాలను కలిసికట్టుగా ఆపకపోతే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. ధర్నాలకే ఈ ప్రభుత్వం భయపడుతోందని చెప్పారు. ప్రజలే ప్రభుత్వానికి నోటీసులిచ్చే పరిస్థితులు వస్తాయని ఆయన చెప్పారు. 

వైకాపా ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం విచ్చలవిడిగా మారిందని జనసేన నేత కందుల దుర్గేశ్ ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న దుందుడుకు చర్యలను ప్రతిఘటించకపోతే ప్రజలే నష్టపోతారన్నారు. ప్రజాశ్రేయస్సు కోసం పోరాడే రాజకీయపక్షాలతో జనసేన కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు. అఖిలపక్ష కార్యాచరణను క్షేత్రస్థాయిలో అమలు చేద్దామన్నారు. కాంగ్రెస్‌ నేత నరసింహారావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఎవరి ప్రచారం వారు చేసుకుందామని.. ఇప్పుడు రాక్షస పాలన నుంచి ప్రజలను కాపాడేందుకు అంతా కలిసి పోరాడదామని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణపై అఖిలపక్ష నిర్ణయానికి కాంగ్రెస్‌ మద్దతు ఉంటుందన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని