Amarinder Singh: 15 రోజుల్లో అమరీందర్‌ సింగ్ కొత్త పార్టీ..?

మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌తో సుదీర్ఘ అనుబంధానికి తెరదించుతూ ఆ పార్టీ

Published : 01 Oct 2021 11:54 IST

పంజాబ్‌: మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌తో సుదీర్ఘ అనుబంధానికి తెరదించుతూ ఆ పార్టీ నుంచి బయటకొచ్చిన మాజీ సీఎం, సీనియర్‌ నేత కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కొత్త పార్టీని స్థాపించేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే 15 రోజుల్లో అమరీందర్‌ నూతన రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశాలున్నాయని ఆయన సన్నిహిత వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఈ విషయమై ఇప్పటికే తన మద్దతుదారులతో విస్తృతంగా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

అంతేగాక, దాదాపు డజను మంది కాంగ్రెస్‌ నేతలు కెప్టెన్‌తో చర్చలు జరుపుతున్నారని, ఆయన కొత్త పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత వారంతా అందులో చేరే అవకాశమున్నట్లు సమాచారం. వీరిలో కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారట. అటు పంజాబ్‌కు చెందిన రైతు నేతలతోనూ అమరీందర్‌ త్వరలోనే సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. 

గత బుధవారం అమరీంద్ సింగ్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన విషయం తెలిసిందే. దీంతో ఆయన కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరడం ఖాయమని ఊహాగానాలు వినిపించాయి. అయితే వీటిపై కెప్టెన్‌ నిన్న స్పష్టత నిచ్చారు. కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించిన ఆయన.. భాజపాలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్త పార్టీ ఏర్పాటుపై దృష్టిపెట్టిన కెప్టెన్‌.. త్వరలోనే దీనిపై ప్రకటన చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆ పార్టీతోనే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని అమరీందర్‌ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని