అమరావతికి మద్దతుగా ర్యాలీలు

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం 300 రోజులవుతున్న సందర్భంగా విజయవాడలో ...

Updated : 11 Oct 2020 13:39 IST

అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం 300 రోజులవుతున్న సందర్భంగా విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్‌టీసీ రోడ్‌లోని శారదా కళాశాల నుంచి ఐదు కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది. ఈ ప్రదర్శనలో రాజకీయ, ప్రజాసంఘాల నాయకులతో పాటు పెద్ద ఎత్తున రైతులు  పాల్గొన్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు.

ఈ సందర్భంగా అమరావతి ఐకాస నాయకులు ఆళ్ల శివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, వర్తకసంఘాలు ఉద్యమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలని కోరారు. సీపీఎం నేత బాబూరావు మాట్లాడుతూ.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం వైకాపాతో కుమ్మక్కై రాజధానితో సంబంధం లేదని చెబుతోందని విమర్శించారు. అమరావతి కోసం, ఉత్తరాంధ్ర అభివృద్ధికోసం, విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడుతామని స్పష్టం చేశారు.

రాజధాని గ్రామాల్లో భారీ ర్యాలీ..
రాజధాని పరిధిలోని 23 గ్రామాల రైతులు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. రాజధాని ఉద్యమం 300 రోజులకు చేరుకుంటున్న సందర్భంగా మరోసారి తమ విన్నపాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు కదం తొక్కారు. తుళ్లూరు అనంతరం, నెక్కల్లు, రాయపూడి, బోరిపాలెం, వెంకటాయపాలెం, కృష్ణాయపాలెం, వెలగపూడి గ్రామాల్లో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని నిరసన తెలిపారు. జై అమరావతి అంటూ నినాదాలతో హోరెత్తించారు. మాజీ ఎమ్మెల్యే  శ్రావణ్ కుమార్‌తో పాటు, అమరావతి ఐకాస నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని