కెప్టెన్‌ కోసం ప్రశాంత్‌ కిశోర్‌ మరోసారి పనిచేస్తారా?

వచ్చే ఏడాదిలో జరగబోయే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ ఇప్పటినుంచే వ్యూహ రచన చేస్తోంది. ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభాన్నినివారించడంపై దృష్టిపెట్టింది......

Published : 08 Jul 2021 16:44 IST

దిల్లీ: వచ్చే ఏడాదిలో జరగబోయే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ ఇప్పటినుంచే వ్యూహ రచన చేస్తోంది. ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభాన్ని నివారించడంపై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో బుధవారం సమావేశమయ్యారు. వచ్చే ఏడాది పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని మంగళవారం కలిసిన మరుసటి రోజే దిల్లీలోని కపుర్తలా హౌస్‌లో ప్రశాంత్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దాదాపు గంట పాటు వీరి భేటీ కొనసాగినట్టు సమాచారం. అయితే, ఇది మర్యాదపూర్వక భేటీయే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్‌ కోసం పనిచేసే అంశాలపై చర్చించలేదని ప్రశాంత్‌ కిశోర్‌ బృందం పేర్కొంటోంది. 

పలు రాష్ట్రాల్లో ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహకర్తగా పనిచేసిన రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడంతో ఆయనకు మంచి గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో మమత హ్యాట్రిక్‌ విజయం వెనుక ప్రశాంత్‌ వ్యూహాలు పనిచేశాయి. 2017 ఎన్నికల్లోనూ పంజాబ్‌లో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారానికి కిశోర్‌ సహకారం అందించారు. ఆ ఎన్నికల్లో 117 స్థానాలకు గానూ 77 సీట్లను ఆ పార్టీ పొందింది. అయితే, 2022 ఎన్నికలకు కెప్టెన్‌ సిద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు, నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్ధూతో వైరం, ప్రభుత్వ వ్యతిరేకత వంటి అంశాలు తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి ప్రశాంత్‌ కిశోర్‌ వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ప్రశాంత్‌ కిశోర్‌ తనకు ముఖ్య సలహాదారునిగా వ్యవహరిస్తారంటూ మార్చిలోనే అమరీందర్‌ సింగ్‌ ప్రకటించడం, ఆయనకు కేబినెట్‌ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

మరోవైపు, పంజాబ్‌లో సిద్ధూని బుజ్జగించేందుకు ఆయనకు పీసీసీ చీఫ్‌, లేదా కేబినెట్‌లో అవకాశం కల్పించాలని సూచించగా.. అందుకే కెప్టెన్‌ నిరాకరించినట్టు సమాచారం. మంగళవారం సోనియాను కలిసిన అనంతరం సిద్ధూకి కీలక పదవిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందా? అని కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ను మీడియా అడగ్గా.. సిద్ధూ గురించి తనకేమీ తెలియదని, పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నాకట్టుబడి ఉంటానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలి ఆదేశాలను శిరసావహిస్తానన్నారు.  

తాను చేస్తున్న ‘ఎన్నికల వ్యూహరచన’ నుంచి తప్పుకోనున్నట్లు బెంగాల్‌ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రశాంత్ కిశోర్‌ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో తాను ఇప్పటికే విఫలమయ్యాయనన్న కిశోర్‌.. భవిష్యత్తు ప్రణాళిక ఏమిటో మాత్రం చెప్పలేదు. అయితే, ఈ మధ్యకాలంలో ఆయన పలు రాజకీయ సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటుండటంతో మరింత క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినబడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని