Punjab: పార్టీని భాజపాలో విలీనం చేయనున్న అమరీందర్‌ సింగ్‌!

గతేడాది పంజాబ్‌ ముఖ్యమంత్రి పదవి కోల్పోవడంతో కొత్త పార్టీని ఏర్పాటు చేసిన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌(80) తన పార్టీని భాజపాలో కలపనున్నట్లు వార్తలు గుప్పుముంటున్నాయి.......

Published : 02 Jul 2022 02:14 IST

చండీగఢ్‌: గతేడాది పంజాబ్‌ (Punjab) ముఖ్యమంత్రి పదవి కోల్పోవడంతో కొత్త పార్టీని ఏర్పాటు చేసిన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌(80) (Amarinder Singh) తన పార్టీని భాజపాలో విలీనం చేస్తున్నట్లు వార్తలు గుప్పుముంటున్నాయి. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అమరీందర్‌ తిరిగివచ్చిన వెంటనే తన పార్టీ ‘పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌’ (పీఎల్‌సీ)ని (Punjab Lok Congress) కాషాయ పార్టీలో విలీనం చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. లండన్‌లో శస్త్రచికిత్స పూర్తిచేసుకున్న అమరీందర్‌.. వచ్చే వారం స్వదేశానికి వచ్చిన వెంటనే ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పార్టీ విలీనంపై ప్రధాని మోదీతో కెప్టెన్‌ మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన అమరీందర్‌ను.. గతేడాది సీఎం పదవి నుంచి  అధిష్ఠానం తొలగించింది. భాజపా కనుసన్నల్లో అమరీందర్‌ పనిచేయడం కారణంగానే పదవి నుంచి తొలగించినట్లు కాంగ్రెస్‌ ఆరోపించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కెప్టెన్‌ కాంగ్రెస్‌ను వీడారు. ఆపై పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో జట్టుకట్టి ముందుకు సాగారు. భాజపా మొత్తం 65 సీట్లలో పోటీ చేయగా.. అమరీందర్‌ పార్టీ 37 సీట్లలో పోటీకి దిగింది. అయితే కెప్టెన్‌ పార్టీ ఒక్క స్థానంలోనూ గెలుపొందలేదు. కెప్టెన్ పటియాలా నుంచి పోటీ చేసిన కెప్టెన్‌కు డిపాజిట్ కూడా దక్కలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని