సువేందు విజయం ఎలా ఉండాలంటే..:అమిత్‌ షా

తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని ఓడిస్తే..పశ్చిమ్‌ బెంగాల్‌లో మార్పు అదే వస్తుందని భాజపా అగ్రనేత అమిత్‌ షా వ్యాఖ్యానించారు.

Updated : 31 Mar 2021 12:13 IST

మమతను ఓడిస్తేనే బెంగాల్‌లో మార్పు

కోల్‌కతా: తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని ఓడిస్తే..పశ్చిమ్‌ బెంగాల్‌లో మార్పు అదే వస్తుందని భాజపా అగ్రనేత అమిత్‌ షా వ్యాఖ్యానించారు. మంగళవారం తూర్పు మిడ్నాపూర్‌లో ఆయన మాట్లాడుతూ..‘భాజపాకు మద్దతు ఇస్తున్నందుకు ఇక్కడి ప్రజలకు నేను తలవంచి నమస్కరిస్తున్నాను. నందిగ్రామ్ ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సువేందు అధికారి నందిగ్రామ్ నుంచి విజయం సాధిస్తారని ఇప్పుడు నాకు తెలుస్తోంది. నందిగ్రామ్‌లో సువేందును గెలిపించడం ఒకటే మా ఉద్దేశం కాదు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి  చేయడం మా ముందున్న లక్ష్యం. భవిష్యత్తులో ఎవరు ‘మా, మాటి, మనుష్’ అంటూ ప్రజల మనోభావాలతో ఆడటానికి సాహసించని విధంగా పెద్ద సంఖ్యలో ప్రజలు సువేందుకు ఓటేయాలని కోరుతున్నాను. ఆయనకు భారీ విజయాన్ని కట్టబెట్టడంలో సహకరించండి’ అని అమిత్‌ షా ఓటర్లను కోరారు.

అలాగే నందిగ్రామ్‌లో జరిగిన అత్యాచార ఘటన గురించి ప్రస్తావించారు. ‘నందిగ్రామ్‌లో చోటుచేసుకున్న అత్యాచార ఘటన దురదృష్టకరమైంది. బెంగాల్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టే అర్థమవుతోంది. అభివృద్ధి, ఉద్యోగ కల్పన, మెరుగైన విద్య, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు..వీటన్నింటిలో మార్పు రావాలంటే మోదీ నేతృతంలోని భాజపాకు ఓటేయండి’ అంటూ మమత పాలనపై విమర్శలు గుప్పించారు. తాము అధికారం చేపట్టిన వెంటనే బెంగాల్‌ సంస్కృతి పునరుద్ధరణకు కృషి చేస్తామన్నారు. 

మమతా బెనర్జీ, సువేందు మధ్య నందిగ్రామ్ పోరు దేశ రాజకీయాలను ఆకర్షిస్తోంది. ఏప్రిల్‌ ఒకటిన జరిగే రెండో దశ పోలింగ్‌లో వీరి భవితవ్యం కూడా తేలనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని