Amit Shah: కాంగ్రెస్‌ నేతలకు మతిపోయింది: అమిత్‌ షా

ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీపై ప్రశంసలు గుప్పిస్తుంటే కాంగ్రెస్‌ నేతలు మాత్రం మతిపోయి మాట్లాడుతున్నారని అమిత్‌ షా విమర్శలు గుప్పించారు. 

Published : 29 Apr 2023 01:26 IST

బెంగళూరు: భాజపా పథకాలను ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై (Narendra Modi) కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) మండిపడ్డారు. కాంగ్రెస్‌ (Congress) పార్టీతోపాటు వారి నేతలకు మతి తప్పిందని అన్నారు. ఎంతో గౌరవంతో ప్రపంచదేశాలు మోదీకి స్వాగతం పలుకుతుంటే కాంగ్రెస్‌ మాత్రం ప్రజలను రెచ్చగొట్టే పనిలో పడిందని విమర్శించారు. కర్ణాటకలోని (Karnataka Elections) ధార్వాడ్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన అమిత్‌ షా.. కాంగ్రెస్‌ అగ్రనేతలపై విమర్శలు గుప్పించారు.

‘సమస్యలపై పోరాడటంలో కాంగ్రెస్‌ పార్టీ వెనకబడింది. గత తొమ్మిదేళ్లుగా భారత్‌ గొప్పతనాన్ని ప్రపంచ వేదికపై నరేంద్ర మోదీ ఎంతో పెంచారు. దేశంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతోపాటు దేశ సరిహద్దులను సురక్షితంగా ఉంచారు. కానీ, కాంగ్రెస్‌ నేతలు మాత్రం మోదీపై విషం చిమ్ముతున్నారు. మోదీపై ఘాటు విమర్శలు చేసే మీరు (మల్లికార్జున ఖర్గే) కాంగ్రెస్‌ పార్టీని ఎన్నికల్లో గెలిపిస్తారా..? అని ప్రశ్నించారు. మోదీపై అనేక విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్‌ నేతలకు మతి పోయిందన్నారు. ప్రధానిని ఎంత తిట్టినా.. కమలం అంతగా వికసిస్తుందని అమిత్‌ షా పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ విష సర్పం లాంటివారని.. ఆయన తెచ్చిన పథకాలు చూసేందుకు ఆకర్షణీయంగా ఉన్నాయని రుచి చూస్తే చావు తప్పదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన తన మాటల ఉద్దేశం వేరని వివరణ ఇచ్చుకున్నారు. భాజపా పథకాలు రుచి చూస్తే చస్తారన్న అర్థంలోనే అలా మాట్లాడానని ఖర్గే చెప్పినప్పటికీ భాజపా నేతలు మాత్రం కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని