UP Polls: ఓట్ల లెక్కింపు వరకే వారిద్దరూ కలిసుంటారు: అమిత్‌ షా

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీలు ప్రచారాన్ని మరింత విస్తృతం చేస్తున్నాయి.

Published : 30 Jan 2022 01:59 IST

ముజఫర్‌నగర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీలు ప్రచారాన్ని మరింత విస్తృతం చేస్తున్నాయి. శనివారం భాజపా అగ్రనేత అమిత్‌ షా యూపీలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ముజఫర్‌నగర్‌లో మాట్లాడుతూ.. ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, ఆర్‌ఎల్‌డీ నేత జయంత్ చౌధరీపై విమర్శలు గుప్పించారు. ఓట్ల లెక్కింపు రోజువరకే వారి పొత్తు నిలుస్తుందని ఎద్దేవా చేశారు. 

‘అఖిలేశ్‌ యాదవ్, జయంత్ చౌధరీ ఓట్ల లెక్కింపు వరకే కలిసుంటారు. ఒకవేళ వారి కూటమి అధికారంలోకి వస్తే.. అజంఖాన్ ప్రభుత్వంలోకి వస్తారు. అప్పుడు జయంత్‌ బయటకు వెళ్లిపోతారు. ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో వారి అభ్యర్థుల జాబితాను చూసి, చెప్పొచ్చు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కమలంతో ఆర్‌ఎల్‌డీ పొత్తుపై అమిత్‌ షా చేసిన ప్రతిపాదనను జయంత్‌ తిరస్కరించారు.  

‘నిన్న ఇక్కడ అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేవన్నారు. ఆ మాట అనడానికి ఆయనకు సిగ్గులేదు. ఎస్పీ పాలన, భాజపా పాలన లెక్కలు తీద్దాం. అందుకు మీకు ధైర్యం ఉందా..? గతంలో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ ఇక్కడ పాలన సాగించాయి. ఆ సోదరి (బీఎస్పీ అధినేత్రి మాయావతి) ఒక వర్గం గురించి మాట్లాడతారు. కాంగ్రెస్ వచ్చి కుటుంబం గురించి మాట్లాడుతుంది. ఇక అఖిలేశ్ బాబు.. గుండాలు, మాఫియా గురించి చెప్తారు’ అంటూ విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. 

ఇదిలా ఉండగా.. దియోబంద్‌లో నిర్వహించాల్సిన ఎన్నికల ప్రచారాన్ని ఈ రోజు అమిత్‌ షా రద్దు చేసుకున్నారు.  కొవిడ్ వేళ భారీగా జనాలు గుమిగూడటంతో ఆయన వెనక్కి వెళ్లిపోయారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని