Gujarat: గుజరాత్‌లో మెజార్టీ వస్తే.. ఆయనే మా సీఎం: అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు..!

ప్రధాని మోదీ, అమిత్‌ షా స్వరాష్ట్రం గుజరాత్‌. రెండు దశాబ్దాలకు పైగా అక్కడ కమలం పార్టీ అధికారంలో ఉంది. వరుసగా ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది.

Updated : 15 Nov 2022 12:36 IST

అహ్మదాబాద్‌: గుజరాత్ ఎన్నికల వేళ.. భాజపా అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు  చేశారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి మెజార్టీ వస్తే, ఆయనే తమ ముఖ్యమంత్రి అంటూ పేరు వెల్లడించారు. అహ్మదాబాద్‌లో జాతీయ మీడియాతో అమిత్‌షా  మాట్లాడారు. 

‘ఈ ఎన్నికల్లో గుజరాత్‌లో భాజపాకు మెజార్టీ వస్తే.. భూపేంద్ర పటేల్ తన పదవిలో కొనసాగుతారు’ అని షా వెల్లడించారు. గుజరాత్‌.. ప్రధాని మోదీ, అమిత్‌ షా స్వరాష్ట్రం. రెండు దశాబ్దాలకు పైగా అక్కడ కమలం పార్టీ అధికారంలో ఉంది. వరుసగా ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే.. గత ఏడాది సెప్టెంబర్‌లో విజయ్‌ రూపానీ స్థానంలో అధిష్ఠానం భూపేంద్ర పటేల్‌ను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది. ఈ నిర్ణయం పార్టీ వర్గాలను ఆశ్చర్యపర్చింది. ఘాట్‌లోడియా నుంచి పటేల్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు అదేస్థానం నుంచి రెండోసారి టికెట్ దక్కించుకున్నారు. 

 మరోపక్క..ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ టీవీ యాంకర్‌ ఇసుదాన్‌ గఢ్వీని ఎంపిక చేసింది. పార్టీ సీఎం అభ్యర్థి కోసం ఆన్‌లైన్‌ ద్వారా జరిగిన పోల్‌లో 16 లక్షలపైగా ఓటర్లు పాల్గొన్నారని, ఇందులో దాదాపు 73% మంది గఢ్వీ వైపు మొగ్గు చూపారని ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. గుజరాత్‌లో రెండు దశల్లో డిసెంబర్ ఒకటి, ఐదు తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎనిమిదిన ఫలితం వెల్లడికానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని