Amit Shah: ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో అధికారం మాదే: అమిత్‌ షా

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వచ్చే ఎన్నికల్లో  తెలంగాణలో అధికారం భాజపాదేనని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు.

Published : 04 Jul 2022 01:33 IST

హైదరాబాద్‌: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వచ్చే ఎన్నికల్లో  తెలంగాణలో అధికారం భాజపాదేనని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన భాజపా సంకల్ప సభలో అమిత్‌ షా ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  కేటీఆర్‌ను ఎలా సీఎంను చేయాలనేదే కేసీఆర్‌ ఆలోచన అని విమర్శించారు. ‘‘ఎనిమిదేళ్లలో కేసీఆర్‌ ఒక్కసారైనా సచివాలయానికి వెళ్లారా? అందుకే కేసీఆర్‌ సచివాలయానికి వెళ్లడం లేదు. వచ్చే ఎన్నికల తర్వాత సచివాలయానికి వెళ్లే అవకాశం మాకే దక్కుతుంది. దేశం పురోగమిస్తుంటే తెలంగాణ తిరోగమిస్తోంది. తెలంగాణ ప్రజలు భాజపాకు ఒక్కసారి అవకాశమివ్వాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో మేం మద్దతిచ్చాం. గతంలో మేం 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు ఎలాంటి సమస్యలు రాలేదు. హైదరాబాద్‌ విమోచన దినాన్ని కేసీఆర్‌ వ్యతిరేకించారు. తెరాస కారు స్టీరింగ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ చేతుల్లో ఉంది. పటేల్‌ లేకుంటే హైదరాబాద్‌ రాష్ట్రం భారత్‌లో భాగం అయ్యేది కాదు. తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు ముగింపు పలుకుతాం’’ అని అమిత్‌ షా స్పష్టం చేశారు.

ఫామ్‌ హౌస్‌ నుంచి ఎంతకాలం ప్రభుత్వం నడవాలి?: పీయూష్‌ గోయల్‌

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ మోదీ మార్గదర్శకత్వంలో తెలంగాణలోనూ భాజపా సర్కారు వస్తుంది. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని భాజపా కాంక్షిస్తోంది.  తెరాస ప్రభుత్వంపై వ్యతిరేకత గ్రామ గ్రామాన కనిపిస్తోంది. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపులను ఇంక తెలంగాణ భరించదు. తెలంగాణలో అవినీతి, దాడులు పెరిగాయి. హుజూరాబాద్‌లో ఈటలను ఓడించేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. తెరాస ఎన్ని చేసినా హుజూరాబాద్‌లో ఈటలే గెలిచారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాకు వచ్చిన 50 సీట్లు ట్రైలర్‌ మాత్రమే. తెలంగాణ ప్రజలకు అవినీతి రహిత ప్రభుత్వం కావాలి. భాజపా ప్రభుత్వం కావాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలోని అనేక ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతోంది. అవినీతి సొమ్ము అంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది? ఫామ్‌ హౌస్‌ నుంచి ఎంతకాలం ప్రభుత్వం నడవాలి? కేసీఆర్‌కు జవాబు ఇచ్చేందుకు భారీ సంఖ్యలో భాజపా శ్రేణులు ఇక్కడికి తరలివచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని