Amit Shah: కేసీఆర్‌ హత్యారాజకీయాలు మొదలు పెట్టారు: అమిత్‌షా

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర పదవుల కోసం కాదని.. తెలంగాణ నిజాం ప్రభువును గద్దె దించేందుకేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు.

Updated : 14 May 2022 21:29 IST

హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర పదవుల కోసం కాదని.. తెలంగాణలో నిజాం ప్రభువును గద్దె దించేందుకేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. కేసీఆర్‌ను సీఎం పీఠం నుంచి దించేందుకు తాను అవసరం లేదని.. సంజయ్‌ ఒక్కడు చాలని వ్యాఖ్యానించారు. రజాకార్‌ పాలన నుంచి విముక్తి కల్పించేందుకు, తెరాసను కూకటివేళ్లతో పెకలించివేసేందుకే ప్రజాసంగ్రామ యాత్ర అని చెప్పారు. 45 డిగ్రీల ఎండలో బండి సంజయ్‌ 660 కి.మీ. నడిచారన్నారు. సీఎం కేసీఆర్‌ చెప్పిన నీళ్లు, నిధులు, నియామకాలు రాష్ట్రంలో జరిగాయా? అని అమిత్‌షా ప్రశ్నించారు. యాత్ర ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తెరాస ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలోని అవినీతి సర్కార్‌ను గద్దె దించేందుకు యువత కదిలి రావాలని అమిత్‌షా పిలుపునిచ్చారు.

ధాన్యం సేకరణ మీ బాధ్యత.. చేతకాకపోతే రాజీనామా చెయ్‌..

‘‘ఇంత అవినీతి ప్రభుత్వాన్ని నా జీవితంలో చూడలేదు. రెండు పడక గదుల ఇళ్లను కేసీఆర్‌ ఎంతమందికి ఇచ్చారు? ప్రధాని ఆవాస్‌ యోజనను రాష్ట్రంలో అమలు చేయడం లేదు. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఒక్కరికీ చేయలేదు. హైదరాబాద్‌లో 4 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తామని ప్రజల్ని మోసం చేస్తున్నారు. ధాన్యం కొనట్లేదని కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు. ధాన్యం సేకరణ మీ బాధ్యత. చేతకాకపోతే రాజీనామా చెయ్‌. మేం అధికారంలోకి వచ్చి కొంటాం. గాంధీ, ఉస్మానియాను పట్టించుకోని సీఎం.. కొత్తగా నిర్మిస్తారా?

కేంద్ర పథకాలకే పేర్లు, ఫొటోలు మార్చేస్తున్నారు

కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు, ఫొటోలు మార్చి అమలు చేస్తున్నారు. సమగ్ర శిక్ష అభియాన్‌ కింద నిధులిస్తే.. దానికే మన ఊరు-మనబడి అంటున్నారు. పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్‌ ఎందుకు పూర్తిచేయట్లేదు? రాష్ట్రంలో కమీషన్లు వచ్చే ప్రాజెక్టులనే ఆయన పూర్తిచేస్తారు. వరంగల్‌కు సైనిక్‌ స్కూల్‌ మంజూరు చేస్తే పట్టించుకోవట్లేదు. ప్రధాని గ్రామీణ సడక్‌ యోజన కింద రూ.వేలకోట్లు నిధులిచ్చాం. కేంద్రం నిధులతోనే గ్రామాలకు రోడ్లు వేశారు. రామగుండం ఫర్టిలైజర్‌కు కేంద్రమే నిధులిచ్చింది. పేదలకు రూ.5లక్షల వైద్యసాయం అందే పథకాన్ని నిలిపేశారు. తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ ఎందుకు అమలు కావట్లేదు? 

తెరాస కారు స్టీరింగ్‌ ఎంఐఎం చేతిలో..

రాష్ట్రంలో కేసీఆర్‌ హత్యారాజకీయాలు మొదలుపెట్టారు. భాజపా కార్యకర్త సాయిగణేశ్‌ను పొట్టనపెట్టుకున్నారు. తెలంగాణలో అధికార మార్పునకు సమయం వచ్చింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భాజపా సిద్ధంగా ఉంది. తెరాస, మజ్లిస్‌ను తీసిపడేయండి.. అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మేం నిర్వహిస్తాం. మైనార్టీలకు రిజర్వేషన్లు తగ్గించి ఎస్సీ, ఎస్టీలకు పెంచుతాం. ఎంఐఎం, తెరాస పార్టీలు అవిభక్త కవలలు. తెరాస కారు స్టీరింగ్‌ ఎంఐఎం చేతిలో ఉంది. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టి మళ్లీ అప్పులు కావాలంటున్నారు. తెలంగాణలోనూ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాలి. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుంది’’ అని అమిత్‌షా అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని