Amit shah: మోదీని అవేం చేయలేవ్‌.. ప్రజల ఆశీస్సులు ఉన్నాయ్‌..: అమిత్ షా

సీనియర్‌ నాయకుల్ని ఎలా గౌరవించాలో భాజపాను చూసి ఇతర పార్టీలు నేర్చుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit shah) అన్నారు. కర్ణాటకలోని బీదర్‌లో ఆయన ప్రసంగించారు.

Published : 04 Mar 2023 01:44 IST

బీదర్‌: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)కి శాపనార్థాలు పెడుతూ కాంగ్రెస్‌, ఆప్‌ నినాదాలు చేస్తున్నాయని.. ఇలాంటివి ఆయన్నేం చేయలేవన్నారు కేంద్ర  హోంమంత్రి అమిత్ షా(Amit shah). ఎందుకంటే ప్రధానికి ప్రజల ఆశీర్వాదం ఉందని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే నెలలో జరగనున్న వేళ బీదర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్‌ షా మాట్లాడారు.  ఈ సందర్భంగా విపక్షాలపై విరుచుకుపడ్డారు. భాజపాపై ఎంతగా బురద చల్లితే కమలం అంతగా వికసిస్తుందన్నారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌లు వారసత్వ పార్టీలని.. అవి ఎప్పుడూ ప్రజలకు మేలు చేయవన్నారు. 

భాజపాను చూసి నేర్చుకోండి..

పార్టీ సీనియర్‌ నేతల్ని ఎలా గౌరవించాలో కాంగ్రెస్‌ పార్టీకి తెలియదని.. వారిని ఎప్పుడూ అవమానిస్తుంటుందని అమిత్‌ షా విమర్శించారు. అనుభవజ్ఞులైన నేతల్ని ఎలా గౌరవించాలో భాజపాను చూసి అన్ని పార్టీలూ నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. కర్ణాటక మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్ప పుట్టిన రోజు సందరర్భంగా ప్రధాని మోదీ ఆయన్ను జనం సమక్షంలోనే సన్మానించిన తీరును, అలాంటి నేతలతో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతల్ని ఎప్పుడూ అవమానాలకు గురిచేస్తుంటుందని.. అది నిజలింగప్ప అయినా మాజీ సీఎం వీరేంద్ర పాటిల్‌ అయినా అంతేనన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని