గవర్నర్‌ అలా అని ఉండాల్సింది కాదు: అమిత్‌ షా

ఆలయాలు తెరిచే అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఆ రాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ మధ్య జరిగిన మాటల యుద్ధంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పందించారు. గవర్నర్‌ ఆ పదాల్ని ఉపయోగించకుండా ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.........

Published : 18 Oct 2020 10:54 IST

దిల్లీ: ఆలయాలు తెరిచే అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఆ రాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ మధ్య జరిగిన మాటల యుద్ధంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పందించారు. గవర్నర్‌ ఆ పదాల్ని ఉపయోగించకుండా ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సీఎన్‌ఎన్‌-న్యూస్‌18కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

లాక్‌డౌన్‌ నిబంధనల్ని సడలిస్తూ క్రమంగా సాధారణ కార్యకలాపాల్ని మహారాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధిరిస్తూ వస్తోంది. అయితే, పండుగల సీజన్‌ కావడంతో భక్తులు భారీ సంఖ్యలో గుమిగూడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలయాలు, ప్రార్థనా మందిరాలను తెరిచేందుకు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నిరాకరించారు. దీనిపై స్పందించిన కోశ్యారీ.. ‘‘బార్లు, రెస్టారెంట్లు, బీచ్‌లను తెరిచారు. కానీ దేవుళ్లను లాక్‌డౌన్‌లో ఉంచారు. ఇలా చేయమని భగవంతుడి నుంచి మీకేమైనా ఆదేశాలు వచ్చాయా? లేదా మీరే అకస్మాత్తుగా లౌకికవాదిగా మారారా?’’ అని లేఖలో ప్రశ్నించారు. ఇది వారివురి మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. శివసేన సహా ఇతర విపక్ష పార్టీలు గవర్నర్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. 

గవర్నర్‌ వ్యాఖ్యల్ని భాజపా ఎలా చూస్తోందని అమిత్‌ షాను ప్రశ్నించగా.. ‘‘జరుగుతున్న సంఘటనల్ని ఉద్దేశిస్తూ ఆయన(కోశ్యారీ) ఆ వ్యాఖ్యలు చేశారు. నా ఉద్దేశం ప్రకారం.. ఆయన ఆ పదాల్ని ఉపయోగించి ఉండాల్సింది కాదు’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని