మోదీ ర్యాలీలు..ఎన్డీయే అభ్యర్థుల జోరు..

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అధికార ఎన్డీఏ ఆధిక్యాన్ని కనబరుస్తోంది.

Updated : 10 Nov 2020 17:29 IST

ఆధిక్యంలో కొనసాగుతున్న ఎన్డీఏ అభ్యర్థులు

పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అధికార ఎన్డీఏ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. అయితే, మరో ఆసక్తికర విషయం ఏంటంటే ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్న చాలా స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో ఉండటం గమనార్హం. ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్రంలో ససారాం, గయ, పట్నా, చాప్రా, దర్భంగా, ముజఫర్‌పూర్, భాగల్‌పూర్, ఈస్ట్ చంపారన్, సమస్తిపూర్, వెస్ట్ చంపారన్, సహర్సా, ఫోర్బెస్‌గంజ్‌లో ఆయన పర్యటించారు. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం..ఇప్పుడు ఆయా ప్రాంతాల్లోని అభ్యర్థులు లెక్కింపులో ప్రత్యర్థులను నెట్టేసి దూసుకెళ్తున్నారు. భాగల్‌పూర్ భాజపా అభ్యర్థి రోహిత్ పాండే..కాంగ్రెస్ అభ్యర్థిని దాటేసి ఆధిక్యంలో ఉన్నారు. దర్భంగాలో 10 స్థానాలకు గాను 9 స్థానాల్లో భాజపా దూసుకెళ్తోంది. పట్నాలోనూ చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. సహర్సాలో పోటీ పడిన అలోక్‌ రంజన్‌(భాజపా) ఆధిక్యంలో ఉండగా, ఆర్జేడీ అభ్యర్థి లవ్లీ ఆనంద్ వెనకంజలో ఉన్నారు. 

కాగా, 243 అసెంబ్లీ స్థానాలు గానూ..దాదాపు సగం సీట్లలో ఎన్డీఏ ఆధిక్యంలో కొనసాగుతోంది. లెక్కింపులో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూను దాటి భాజపా దూసుకెళ్తోంది. ఇదిలా ఉండగా..  శనివారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రం మహాగట్ బంధన్‌వైపే మొగ్గు చూపాయి. కానీ, మంగళవారం పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. 144 నియోజకవర్గాల్లో ఆర్జేడీ అభ్యర్థులను నిల్చోబెట్టగా..65 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. 70 స్థానాలకు గానూ 21 స్థానల్లోనే ఆధిక్యాన్ని కనబరుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని