
Ap News: భాజపాకు ఇవ్వని అనుమతి వారికెలా ఇచ్చారు: ఏపీ భాజపా నేతలు
విజయవాడ: కర్నూలు జిల్లా ఆత్మకూరులో భాజపా నంద్యాల అధ్యక్షుడు బిడ్డా శ్రీకాంత్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, భాజపా సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ విజయవాడ ధర్నాచౌక్లో నిరసన చేపట్టారు. పోలీసులపై దాడి చేసిన వారిని కూడా అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, శ్రీకాంత్ రెడ్డికి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఆత్మకూరు ఘటనలో పోలీసులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు. పోలీసులు ఉండగానే గొడవ జరగడం.. గాయపడిన భాజపా నేతను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు.
‘‘పోలీసులు వైకాపాకు అనుకూలంగా వ్యవహరించడం వల్లే దారుణాలు జరుగుతున్నాయి. ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం. చట్టం, నిబంధనలు అనేవి పాటించే వారే కనిపించడం లేదు. పోలీసులు ప్రభుత్వం ఏం చెబితే అదే అనుసరిస్తున్నారు. ఆత్మకూరులో జరిగిన ఘటనపై ఇప్పటివరకు పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? భాజపా నేతలకు అనుమతి ఇవ్వని పోలీసులు.. మంత్రికి ఎలా ఇచ్చారు? పోలీసులను తీసుకుని వెళ్లిన శ్రీకాంత్ రెడ్డిపై వాళ్ల సమక్షంలోనే దాడి చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇదంతా చేయిస్తున్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. జరిగిన ఘటనను భాజపా చాలా సీరియస్గా తీసుకుంది. భాజపా కేంద్ర నాయకత్వం కూడా ఈ అంశాలను పరిశీలిస్తుంది. మేమంతా డీజీపీని కలిసి న్యాయం చేయాలని కోరతాం. అప్పటికీ న్యాయం చేయకపోతే మా పోరాటాన్ని కొనసాగిస్తాం’’ అని నేతలు పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.