Chandrababu: 100 రోజుల కార్యాచరణ సిద్ధం చేసుకోండి

ప్రతి మంత్రిత్వశాఖకు సంబంధించి వచ్చే వంద రోజుల్లో చేయాల్సిన పనులపై తక్షణం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సూచించారు.

Published : 25 Jun 2024 06:10 IST

ఆర్థిక సమస్యలేని హామీలను తక్షణం అమలుచేయాలి 
‘సంక్షేమం- అభివృద్ధి’ ప్రభుత్వ తారకమంత్రం 
ప్రజలకు చాలా అంచనాలున్నాయి.. బాగా కష్టపడాలి 
కాన్వాయ్‌లు, సైరన్‌ల వంటి ఆడంబరాలు వద్దు 
మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం 

క్యాబినెట్‌ సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు 

ఈనాడు, అమరావతి: ప్రతి మంత్రిత్వశాఖకు సంబంధించి వచ్చే వంద రోజుల్లో చేయాల్సిన పనులపై తక్షణం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సూచించారు. తమ శాఖలపై మంత్రులు లోతుగా అధ్యయనం చేయాలని, వీలైనంత త్వరగా పూర్తి అవగాహన పెంచుకోవాలని తెలిపారు. నేర్చుకోవడం నిరంతర ప్రక్రియని తెలిపారు. సోమవారం జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మంత్రులకు పలు సూచనలు చేశారు. 17 మంది తొలిసారి మంత్రులు కావడం, వారిలోనూ ఏడుగురు మొదటిసారి ఎమ్మెల్యేలు కావడంతో ఆయన వారికి నిర్దిష్టంగా కొన్ని సూచనలు చేశారు. భారీ కాన్వాయ్‌లు, సైరన్‌ వాహనాలు వంటి ఆడంబరాలు వద్దని స్పష్టంచేశారు. ‘సంక్షేమం- అభివృద్ధి’ ఎన్‌డీఏ ప్రభుత్వ తారకమంత్రంగా ఆయన పేర్కొన్నారు. సంక్షేమానికి తొలి ప్రాధాన్యమిస్తూ, అభివృద్ధికీ పెద్దపీట వేస్తామని తెలిపారు. ‘ప్రజలు మనకు 164 అసెంబ్లీ సీట్లతో చారిత్రక విజయం కట్టబెట్టారు. మన ప్రభుత్వంపై ప్రజల్లో చాలా అంచనాలున్నాయి. వాటిని చేరుకోవడానికి మనం చాలా ఎక్కువ పనిచేయాలి. రాజకీయ నాయకులు తమకన్నీ తెలుసునన్న భావనలో ఉంటారు. ఆ ధోరణి సరి కాదు. నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ. అప్పుడే సబ్జెక్ట్‌పై పూర్తి పట్టు లభిస్తుంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు. అనాలోచిత, తొందరపాటు నిర్ణయాలు వద్దని, నిర్మాణాత్మకంగా, సమష్టిగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. విలేఖరుల సమావేశాలకు పూర్తి సంసిద్ధతతో వెళ్లాలన్నారు. మంత్రుల పేషీల్లో వివాదరహితుల్ని, మంచి నడవడిక ఉన్నవారినే అధికారులు, సిబ్బందిగా నియమించుకోవాలని, ఆ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేశారు. వీలైనంత ఎక్కువగా సచివాలయానికి రావాలని మంత్రులకు ఆయన సూచించారు.

భేటీలో పాల్గొన్న మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ 

పెద్ద పెద్ద సభలు వద్దు.. 

భారీ ఖర్చుతో పెద్ద పెద్ద సభలు నిర్వహించే విధానాలకు స్వస్తి చెప్పాలన్నారు. ‘ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల బలాన్ని చాటడానికి భారీ సభలు అవసరం. కానీ అధికారంలో ఉన్నప్పుడు భారీ సభలు అవసరం లేదు. మనం చెప్పాలనుకున్నది ప్రజలకు చేరితే చాలు. దానికి మీడియా ఉంది. అలాంటపుప్పడు చిన్న చిన్న సమావేశాలు పెట్టుకుంటే సరిపోతుంది. చిన్న సమావేశాలైతే ప్రజలకు, మీకూ మధ్య అనుబంధం కూడా పెరుగుతుంది’ అని మంత్రులకు చంద్రబాబు సూచించారు. ప్రజా జీవితంలో ఉన్నామని నిరంతరం గుర్తుంచుకోవాలని, సామాజిక మాధ్యమాల విస్తృతిని దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ఎవరూ అభ్యంతరకరమైన భాష వాడవద్దని హెచ్చరించారు. మంత్రులు జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు విధిగా పార్టీ కార్యాలయాల్ని సందర్శించాలని, కార్యకర్తల్ని కలవాలని సూచించారు. ఏ పని చేసినా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలని స్పష్టంచేశారు.

రామానాయుడు, ఆనం రామనారాయణరెడ్డి, సత్యప్రసాద్, డోలా బాల శ్రీవీరాంజనేయస్వామి తదితరులు

సమీక్షలకు నేనూ వస్తా..  సాయంత్రం 6 తర్వాత సమావేశాలు వద్దు  

శాఖాపరమైన సమీక్షా సమావేశాల సమయం తగ్గించుకోవాలని, వీలైనంత వరకు సాయంత్రం ఆరు గంటల తర్వాత సమావేశాలు వద్దని చంద్రబాబు సూచించారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని వెంటనే చేయగలిగినవి, ఆర్థికపరమైన అంశాలతో ముడిపడినవి అని రెండు విభాగాలుగా చేసుకోవాలని తెలిపారు. ఆర్థికపరమైన అంశాలతో సంబంధం లేనివి వెంటనే నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్థికపరమైన అంశాలతో ఉన్న వాటికి గడువు పెట్టుకుని అమలు చేయాలని స్పష్టంచేశారు. వచ్చే వారం నుంచి మంత్రులు నిర్వహించే సమీక్షా సమావేశాలకు తాను కూడా హాజరవుతానని తెలిపారు.  

లోక్‌సభ సభ్యుల సేవలు వినియోగించుకోండి 

కేంద్రం మద్దతుతో రాష్ట్ర పునర్నిర్మాణానికి.. రాష్ట్రానికి చెందిన ఎన్డీయే ఎంపీలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, వారి సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. పోలవరంపై చర్చ సందర్భంగా.. ఎప్పటిలోగా పూర్తి చేయగలమని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించగా.. దానిపై అంతర్జాతీయ నిపుణులు అధ్యయనం చేస్తున్నారని, వారి నివేదిక వచ్చాకే ఒక అంచనాకు రాగలమని చంద్రబాబు చెప్పారు. అన్న క్యాంటీన్ల వల్ల ఎక్కువ ప్రయోజనం పొందేది భవన నిర్మాణ కార్మికులు కాబట్టి.. క్యాంటీన్‌లు పునఃప్రారంభ కార్యక్రమంలో వారిని భాగస్వాముల్ని చేయాలన్న సూచన మంత్రివర్గ సమావేశంలో వచ్చింది. క్యాంటీన్ల నిర్వహణకు ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మంత్రి లోకేశ్‌ ప్రతిపాదించారు.   

వచ్చే నెలలో పూర్తిస్థాయి బడ్జెట్‌.. 

వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ గడువు జులై నెలాఖరుతో ముగుస్తున్నందున.. వచ్చే నెల రెండు లేదా మూడో వారంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. పింఛన్లు వంటి సంక్షేమ పథకాల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు భాగస్వాములు కావాలని చంద్రబాబు సూచించారు. వారు అందుబాటులో లేకపోయినా కార్యక్రమం మాత్రం ఆగడానికి వీల్లేదని స్పష్టంచేశారు. 1994 నుంచి ఇప్పటి వరకు తెదేపా ప్రభుత్వాల హయాంలోనే డీఎస్సీలో 2 లక్షల ఉపాధ్యాయ కొలువుల భర్తీ జరిగిందన్న అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ప్యాలెస్‌లను తలదన్నేలా వైకాపా కడుతున్న కార్యాలయ భవనాలు అక్రమ నిర్మాణాలన్న విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న చర్చ మంత్రివర్గ సమావేశంలో జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని