Andhra News: కేబినెట్‌ కూర్పునకు ప్రాతిపదిక ఇదే!.. కొడాలి నానికి కీలక పదవి

గత కొన్ని రోజులుగా ఏపీలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు నూతన కేబినెట్‌ జాబితాను విడుదల చేయడంతో మంత్రి పదవి దక్కిన వారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతుండగా...

Updated : 10 Apr 2022 18:31 IST

అమరావతి: గత కొన్ని రోజులుగా ఏపీలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు నూతన కేబినెట్‌ జాబితాను విడుదల చేయడంతో మంత్రి పదవి దక్కిన వారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతుండగా... మంత్రి పదవి ఆశించి భంగపడిన వారు తీవ్ర నిరాశతో ఉన్నారు.  మొత్తం మీద.. పాత, కొత్త కలయికతో మంత్రివర్గ కూర్పు జరిగింది. సామాజిక, రాజకీయ సమీకరణలే ప్రాతిపదికగా కేబినెట్‌ కూర్పు జరిగిందని వైకాపా వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో 10 మంది  సీనియర్లకు మళ్లీ మంత్రివర్గంలో స్థానం లభించింది. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరి జయరాం, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, పినిపె విశ్వరూప్‌, తానేటి వనిత, నారాయణస్వామి, అంజాద్‌ బాషాకు రెండోసారి కూడా అవకాశం దక్కింది. మరో 15 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. కొత్త కేబినెట్‌లో 8 జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో స్థానం కల్పించలేదు. కొన్నిజిల్లాల్లో ఇద్దరికి అవకాశం దక్కింది. చిత్తూరు జిల్లాలో ఏకంగా ముగ్గురికి అవకాశం లభించింది. ఈ జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి, నారాయణస్వామిలను కొత్త మంత్రివర్గంలోనూ కొనసాగించగా.. కొత్తగా ఆర్కే రోజాకు కేబినెట్‌లో అవకాశమిచ్చారు. శ్రీకాకుళం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాల్లో ఇద్దరు చొప్పున అవకాశం దక్కింది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, కాకినాడ, తూర్పుగోదావరి, కృష్ణా, బాపట్ల, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరికి అవకాశం దక్కింది. 

స్టేట్‌డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా కొడాలి నాని

పాత కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన వారిని బుజ్జగించేందుకు వారిలో కొందరికి వివిధ పోస్టులు కల్పించాలని సీఎం నిర్ణయించారు. ఈనేపథ్యంలో స్టేట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌గా కొడాలి నానిని నియమించనున్నట్టు తెలుస్తోంది. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం స్టేట్‌ డెవలప్‌ మెంట్‌ బోర్డును ఏర్పాటు చేయనుంది. ప్లానింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌గా మల్లాది విష్ణుకు అవకాశం కల్పించారు. ప్రభుత్వ ఛీఫ్ విప్‌గా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజును నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ స్పీకర్‌గా కొలగట్ల వీరభద్రస్వామిని నియమించనున్నారు. ప్రస్తుత కేబినెట్‌లో ఆర్యవైశ్యులకు ప్రాతినిథ్యం లేకపోవడంతో కొలగట్లకు డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త కేబినెట్‌లో ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్‌కు మరోసా ప్రాతినిధ్యం లభించింది.  ఈ జిల్లా నుంచి పాతకేబినెట్‌లో సీనియర్‌ మంత్రులుగా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ ఉన్నప్పటికీ వారిలో ఒకరికే అవకాశం కల్పించారు. కొత్త కేబినెట్‌లో తనకు అవకాశం కల్పించకపోవడంపై బాలినేని కినుకవహించడంతో సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించారు. తొలుత విడుదలైన మంత్రివర్గ జాబితాలో శ్రీసత్యసాయి జిల్లా నుంచి తిప్పేస్వామి పేరు ఉండగా.. చివరిక్షణంలో తిప్పేస్వామి పేరు తొలగించి ఆదిమూలపు సురేష్‌ పేరు చేర్చారు.  విశాఖ జిల్లా నుంచి ఎవరికీ స్థానం దక్కలేదు. కొత్త జిల్లాల కంటే సామాజిక, రాజకీయ సమీకరణలే ప్రాధాన్యతగా తీసుకున్నట్టు తెలుస్తోంది. సీనియర్ల కేటగిరీలో ధర్మాన ప్రసాదరావు, పినిపె విశ్వరూప్‌కు అవకాశం లభించింది. మహిళలకు సముచిత స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. ఆ విధంగానే కొత్త కేబినెట్‌లో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు. కొత్త కేబినెట్‌లో మంత్రులుగా అవకాశం దక్కించుకున్న వారికి  ఏ ఏ శాఖలు లభిస్తాయో మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని