Hyderabad: తెదేపా నేత చింతకాయల విజయ్‌కు సీఐడీ నోటీసులు.. బంజారాహిల్స్‌లో స్వల్ప ఉద్రిక్తత

తెలుగుదేశం పార్టీ సామాజిక మాధ్యమ బాధ్యుడు చింతకాయల విజయ్‌కు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 6వ తేదీన ఉదయం 10.30 నిమిషాలకు మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఉన్న సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Updated : 02 Oct 2022 06:42 IST

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు, పార్టీ సామాజిక మాధ్యమ బాధ్యుడు చింతకాయల విజయ్‌కు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 6న ఉదయం 10.30 గంటలకు మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఉన్న సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇవాళ హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో ఉన్న విజయ్ ఇంటికి సీఐడీ పోలీసులు వచ్చారు. అపార్ట్‌మెంట్ కాపలాదారుడిని ఇంటి చిరునామా అడిగారు. అదే సమయంలో అక్కడే ఉన్న విజయ్ కారు డ్రైవర్‌ను వెంట పెట్టుకొని సీఐడీ పోలీసులు విజయ్ ఇంట్లోకి వెళ్లారు. ఆ సమయంలో విజయ్ ఇంట్లో లేరని, సీఐడీ పోలీసులు ఇల్లు మొత్తం వీడియో తీశారని పనిమనిషి తెలిపారు. విజయ్ పెద్ద కుమార్తెను కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ఇంట్లోకి తీసుకెళ్లాలని తనపై చేయి చేసుకున్నారని విజయ్ కారు డ్రైవర్ తెలిపాడు. ఓ కేసులో 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చేందుకు మాత్రమే ఇంటికి వచ్చామని సీఐడీ అధికారి పెద్దిరాజు వెల్లడించారు. నోటీసులు ఇచ్చి వెళ్తున్న సమయంలో కొందరు తెదేపా నాయకులు విజయ్ ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ సీఐడీ అధికారులతో వాగ్వాదానికి దిగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వచ్చింది పోలీసులా? కాదా? అనే అనుమానం ఉందంటూ బంజారాహిల్స్ పీఎస్‌లో తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు.

పోలీసులను రౌడీల్లా ఉసిగొల్పుతున్నారు: చంద్రబాబు

తెదేపా యువనేత చింతకాయల విజయ్ ఇంట్లోకి దోపీడీ దొంగల్లా పోలీసులు చొరబడటాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. విజయ్ ఇంట్లో చిన్న పిల్లలను, పని వాళ్లను భయభ్రాంతులకు గురి చేసేలా సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల  వయసున్న పసిపిల్లను పోలీసులతో భయపెట్టే నీచమైన స్థితికి జగన్ రెడ్డి దిగజారాడని ధ్వజమెత్తారు. సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చేందుకే వస్తే, డ్రైవర్‌పై దాడి చేయడం ఎందుకని ప్రశ్నించారు. కేసులు, విచారణల పేరుతో పోలీసులను రౌడీల్లా ప్రతిపక్ష నేతలపైకి జగన్ ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. బీసీ నేత అయ్యన్న పాత్రుడు కుటుంబంపై జగన్ ప్రభుత్వం మొదటి నుంచీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో నర్సీపట్నంలో అయ్యన్న ఇంటిపై ఇలాగే దాడి చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో రోజుకో సీఐడీ కేసు, వారానికో అరెస్టు తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు మరేమీ చెయ్యడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ప్రతిపక్షానికి ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.  సీఐడీ లాంటి విభాగాన్ని అడ్డుపెట్టుకుని వేధింపులతో పాలన సాగించడం సిగ్గుచేటని విమర్శించారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులా?: అయ్యన్నపాత్రుడు

ఏపీ సీఐడీ నిబంధనలు అతిక్రమిస్తోందని తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. ఏపీ ముఖ్యమంత్రి ఇంట్లో చిన్న పిల్లలు లేరా? అని ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకుండా సీఐడీ అధికారులు ఎలా వస్తారని నిలదీశారు. ఏపీ సీఐడీ పోలీసులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చట్ట ప్రకారం వస్తే ఎవరైనా సహకరిస్తారని స్పష్టం చేశారు. ఏపీలో రాక్షస ప్రభుత్వం నడుస్తోందన్న అయ్యన్న.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇంటి గోడ పడగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దోపిడీని ప్రశ్నిస్తే కక్షసాధింపు చర్యలా అని ధ్వజమెత్తారు. ఇంట్లో యజమాని లేని సమయంలో ఆడవాళ్లను, చిన్న పిల్లలను బెదిరిస్తారా అని దుయ్యబట్టారు. జగన్‍పై జనం తిరుగుబాటు చేసే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని