నారాయణ నివాసంలో సీఐడీ సోదాలు

తెదేపా సీనియర్‌నేత, మాజీ మంత్రి పి.నారాయణ నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాజధాని అమరావతిలో అసైన్డ్‌ భూముల కొనుగోళ్లు ..

Updated : 17 Mar 2021 14:32 IST

నెల్లూరు: తెదేపా సీనియర్‌నేత, మాజీ మంత్రి పి.నారాయణ నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాజధాని అమరావతిలో అసైన్డ్‌ భూముల కొనుగోళ్లు , అమ్మకాలకు సంబంధించి నారాయణపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ నెల్లూరు చింతారెడ్డి పాలెంలోని ఆయన నివాసంలో సోదాలు చేపట్టారు. నారాయణ నివాసానికి గేటు వేసి లోపలికి ఎవరినీ వెళ్లనీయకుండా సోదాలు కొనసాగిస్తున్నారు.

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని నారాయణ నివాసంలో సీఐడీ అధికారులు ఇవాళ నోటీసులు అందజేశారు. నారాయణ అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్యకు నోటీసులు అందజేశారు. ఈనెల 22న విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. సీఐడీ సైబర్‌ సెల్‌ విభాగం డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణ పేరిట ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఇదే కేసుకు సంబంధించి ఈనెల 23న విచారణకు హాజరుకావాలని మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుకు సీఐడీ అధికారులు నిన్న నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు  కేసు నమోదు చేశారు.

నాలుగు రోజుల కిందట ఎఫ్‌ఐఆర్‌
‘గత ప్రభుత్వంలోని కొంతమంది పలుకుబడి కలిగిన వ్యక్తులు తమను మోసగించారంటూ నా నియోజకవర్గానికి చెందిన కొంతమంది రైతులు నాకు వినతిపత్రం ఇచ్చారు. తమ భూముల్ని అక్రమంగా, మోసపూరితంగా తీసుకున్నారని వారు నా దృష్టికి తీసుకొచ్చారు. అసైన్డ్‌ భూములకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే భూ సమీకరణ కింద వాటిని ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొంటూ కొంతమంది మధ్యవర్తులు అమాయక రైతుల్లో గందరగోళం సృష్టించారు. భూములు పోతాయనే అభద్రతను, భయాన్ని కల్పించారు. పెద్ద కుట్రలో భాగస్వాములయ్యారు. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని నేను పరిశీలించాను. అందులో అనేక అవకతవకలు ఉన్నాయి. వాటి వల్ల ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలకు తీవ్రనష్టం వాటిల్లింది. ఈ జీవోల ద్వారా గత ప్రభుత్వ హయాంలోని వ్యక్తులు అనుచిత లబ్ధి పొందారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి’ అని గత నెల 24న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా మర్నాడే సీఐడీ అధికారులు ప్రాథమిక విచారణకు ఆదేశించారు. డీఎస్పీ ఎస్‌.సూర్యభాస్కరరావును విచారణాధికారిగా నియమించారు. ఆయన ఈనెల 12న నివేదిక సమర్పించారని, నేరం జరిగినట్లు అందులో తేలడంతో కేసు నమోదు చేసినట్లు సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని