Chandrababu: చట్ట పరిధిలో దోషుల్ని శిక్షిద్దాం.. క్షేత్రస్థాయికి వెళ్లొద్దు

‘‘దోషుల్ని చట్ట పరిధిలో శిక్షిద్దాం. అంతేతప్ప క్షేత్రస్థాయికి వ్యక్తిగతంగా వెళ్లొద్దు’’ అని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

Published : 04 Jul 2024 05:43 IST

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు సీఎం సూచన

ఈనాడు, అమరావతి, ఎ.కొండూరు, తిరువూరు, న్యూస్‌టుడే:  ‘‘దోషుల్ని చట్ట పరిధిలో శిక్షిద్దాం. అంతేతప్ప క్షేత్రస్థాయికి వ్యక్తిగతంగా వెళ్లొద్దు’’ అని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలం కంభంపాడులో వైకాపా ఎంపీపీ నాగలక్ష్మి భర్త నిర్మిస్తున్న భవనం కూల్చివేత వ్యవహారంలో కొలికపూడిని చంద్రబాబు బుధవారం పిలిపించి మాట్లాడారు. కొంతమంది అధికారుల తీరులో ఇంకా మార్పు రాలేదని, నిబంధనల ప్రకారం వ్యవహరించాలని కోరినా వారినుంచి స్పందన లేకపోవడం వల్లే తాను క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సి వచ్చిందంటూ చంద్రబాబుకు ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. వైకాపా నాయకులు గతంలో చంద్రబాబు కాన్వాయ్‌పైన, ఇటీవల ఎన్నికల ప్రచార సమయంలో కేశినేని చిన్నిపై చేసిన రాళ్లదాడి ఘటనల గురించి ఎమ్మెల్యే శ్రీనివాసరావు చంద్రబాబుకు వివరించారు.

కొలికపూడిపై కేసు నమోదు

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై ఎ.కొండూరు పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం అర్ధరాత్రి కేసు నమోదైంది. కంభంపాడులో వైకాపా ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త చెన్నారావు తమ స్థలం ఆక్రమించి భవనాలు నిర్మిస్తున్నట్లు ముగ్గురు బాధితులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో ఆ స్థలాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. మంగళవారం మధ్యాహ్నం పార్టీ వర్గీయులు, పొక్లెయిన్, డోజర్‌తో కంభంపాడు చేరుకుని ఆ భవనాన్ని పాక్షికంగా కూల్చారు. దీనిపై మంగళవారం కంభంపాడులో ఉద్రిక్తత నెలకొంది. దీంతో అదేరోజు రాత్రి ఎంపీపీ నాగలక్ష్మి తన ఇంటిని ఎమ్మెల్యే అక్రమంగా కూల్చారని పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆమె ఫిర్యాదు మేరకు శ్రీనివాసరావుపై బీఎన్‌ఎస్‌ 329(1), 189(2), 324(1) రెడ్‌విత్‌ 190 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేశారు.

నా పదవి శాశ్వతం కాదు

‘నా పదవి శాశ్వతం కాదు. బాధితులకు న్యాయం చేయలేనప్పుడు నాలాంటి వాడు రాజకీయాల్లో కూడా అవసరం లేదు’ అంటూ ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఫేస్‌బుక్‌ వేదికగా సంచలన ప్రకటన చేశారు. ఎ.కొండూరు మండలం కంభంపాడులో వైకాపా ఎంపీపీ కె.నాగలక్ష్మి భర్త చెన్నారావు అక్రమంగా భవన నిర్మాణం చేపట్టారనే ఫిర్యాదుల నేపథ్యంలో కూల్చివేతకు తాను రంగంలోకి దిగడానికి కారణాలు వివరిస్తూ బుధవారం ఆయన తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో పెట్టిన పోస్టు చర్చకు దారితీసింది. ‘ఈ ఊరి పేరు కంభంపాడు. తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు మండలంలో ఉంది. ఇక్కడొక రాక్షసుడు ఉన్నాడు. అతని పేరు చెన్నారావు. అతని అరాచకాలతో ఎందరో గ్రామం విడిచి వెళ్లిపోయారు నలుగురిని కొట్టి, వాళ్ల స్థలాలు లాక్కుని, పక్కనున్న ప్రభుత్వ భూమిని కలుపుకొని కడుతున్న వాణిజ్య ప్రాంగణం నిర్మాణం ఆపాలని తహసీల్దారు, ఆర్డీవో స్థాయి అధికారులను అడిగితే వంద కథలు చెప్పారు. గత్యంతరం లేక నేను రంగంలోకి దిగి వేలమంది బాధితులతో నిరసన చేపట్టిన తర్వాతే అధికారులు నోటీసులిచ్చి నిర్మాణం ఆపారు. నాకు పదవి శాశ్వతం కాదు. బాధితులకు న్యాయం చేయలేనప్పుడు నాలాంటివాడు రాజకీయాల్లో కూడా అవసరం లేదు’ అంటూ పోస్టులో ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని