Cm Jagan: వచ్చే ఎన్నికలే లక్ష్యంగా సీఎం జగన్‌ సరికొత్త వ్యూహం

2024 ఎన్నికలే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న వారిని ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు సరికొత్త వ్యూహం రచించారు.

Updated : 08 Dec 2022 20:33 IST

అమరావతి: 2024 ఎన్నికలే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న వారిని ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు సరికొత్త వ్యూహం రచించారు. ఇప్పటికే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి 50 ఇళ్లకు ప్రభుత్వం తరఫున ఒక వాలంటీర్‌ను నియమించిన జగన్‌ .. తాజాగా ఇప్పుడు వైకాపా తరఫున ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు  గృహసారథులను నియమించనున్నట్టు చెప్పారు. వైకాపా సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, పరిశీలకులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ భేటీ అయ్యారు.

క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న సైన్యాన్ని వ్యవస్థీకృతం చేయడమే ప్రధాన ఉద్దేశమన్న జగన్‌ .. 50 కుటుంబాల వారీగా మ్యాపింగ్‌ చేస్తున్నామని తెలిపారు. ప్రతి 50 ఇళ్లకు ఒక పురుషుడు, మహిళ గృహసారథులుగా ఉంటారని వెల్లడించారు. పార్టీ సందేశాన్ని చేరవేయడం, పబ్లిసిటీ మెటీరియల్‌ అందించడం వంటి కార్యక్రమాలు వీళ్లు చూస్తారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పార్టీ తరఫున ముగ్గురు కన్వీనర్లు ఉంటారన్న సీఎం జగన్‌.. వీరిలో కనీసం ఒక మహిళ ఉంటారని వివరించారు. మొత్తంగా 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున 15వేల గ్రామాల్లో 5లక్షల మందికి పైగా గృహ సారథులను ఈనెల 20లోపు ఎంపిక చేస్తామని పార్టీ నేతలకు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో 45వేల మంది కన్వీనర్లు ఉంటారని వివరించారు. ముందుగా రాష్ట్రంలోని 15వేల సచివాలయాలకు ముగ్గురు చొప్పున కన్వీనర్ల ఎంపికను ప్రారంభించాలని సూచించిన జగన్‌.. ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు వీరిని ఎంపిక చేయాలన్నారు. గృహసారథులు, కన్వీనర్లకు ఉచిత జీవిత బీమా ఉంటుందని, పార్టీ విస్తృత స్థాయి సమావేశాలకు వీరు ఆహ్వానితులుగా ఉంటారని జగన్‌ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలిచేలా పార్టీ నేతలు కృషి చేయాలని జగన్‌ పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని