AP News: అసంతృప్త నేతలను బుజ్జగిస్తున్న జగన్‌.. సుచరితకు దక్కని అపాయింట్‌మెంట్‌

ఏపీలో మంత్రి పదవులు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న వైకాపా ఎమ్మెల్యేల వ్యవహారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది.

Updated : 12 Apr 2022 16:23 IST

అమరావతి: ఏపీలో మంత్రి పదవులు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న వైకాపా ఎమ్మెల్యేల వ్యవహారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. అసంతృప్త నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సీఎం జగన్‌ వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా.. మంత్రి పదవి ఇవ్వలేకపోవడానికి గల కారణాలను సీఎం జగన్‌ పిన్నెల్లికి వివరించారు. దీంతో పిన్నెల్లి మెత్తబడినట్టు తెలుస్తోంది. వైకాపా ప్రాంతీయ బాధ్యుడు, ఎంపీ మోపిదేవి వెంకటరమణ.. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానును సీఎం వద్దకు తీసుకొచ్చారు. మంత్రి పదవి ఇవ్వలేకపోవడానికి గల కారణాలను ఉదయభానుకు వివరించిన సీఎం... భవిష్యత్తులో మంత్రి పదవుల భర్తీలో ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చి బుజ్జగించినట్టు సమాచారం. ఇప్పటికే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన మాజీ హోం మంత్రి మేకతోటి సుచరితకు సీఎం అపాయింట్‌ మెంట్‌ దక్కలేదు. సుచరిత రాజీనామా వ్యవహారంపై మోపిదేవి వెంకటరమణ సీఎంతో చర్చిస్తున్నారు.

మంత్రి పదవి రాలేదని అసంతృప్తి లేదు: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి


మంత్రి పదవి రాలేదని తనకు అసంతృప్తి లేదని మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. పార్టీ కోసం పనిచేయడమే తన లక్ష్యమని, ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతలు నిర్వర్తిస్తానని తెలిపారు. పిన్నెల్లికి మంత్రి పదవి రాలేదని రెండ్రోజులుగా మాచర్లలో నిరసనలు జరుగుతున్న దృష్ట్యా.. ఆయన్ను సీఎం పిలిచి మాట్లాడారు. అంతకుముందు మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి కూడా పిన్నెల్లిని బుజ్జగించారు. దీంతో పిన్నెల్లి కాస్త మెత్తబడ్డారు. సీఎంతో భేటీ అనంతరం పిన్నెల్లి మీడియాతో మాట్లాడుతూ...‘‘ పార్టీ అంటే నేను.. నేనంటే పార్టీ. మొదట్నుంచి జగన్‌ కోసం, పార్టీ కోసం పనిచేశాం. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యా. మంత్రి పదవి ఆశించా. సామాజిక సమీకరణలు కూర్పు చేసే క్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. అందుకే సీనియర్లకు మంత్రి పదవులు రాలేదు. మంత్రి పదవి రాలేదని మాకు ఎలాంటి బాధ లేదు. ముఖ్యమంత్రి ఏ బాధ్యతలు అప్పగించినా పార్టీకోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మా టార్గెట్‌ 2024’’ అని పిన్నెల్లి మీడియాకు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని