CM Jagan: జరగని ఘటనలు జరిగినట్లు విష ప్రచారం చేస్తున్నారు: ఏపీ సీఎం జగన్‌

సారా తయారీదారులపై ఉక్కుపాదం మోపేందుకు తమ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో

Updated : 15 Mar 2022 17:51 IST

అమరావతి: సారా తయారీదారులపై ఉక్కుపాదం మోపేందుకు తమ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మరణాలపై తెదేపా అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. శాసనసభలో సీఎం మాట్లాడారు. 

‘‘జంగారెడ్డిగూడెం జనాభా 55వేలు. అంతమంది నివసించే ప్రాంతంలో ఎవరైనా సారా తయారీ చేయగలుగుతారా? మున్సిపల్‌ వ్యవస్థ, వార్డు సచివాలయాలు, పోలీస్‌స్టేషన్‌ ఉన్న ప్రాంతంలో సారా తయారీ సాధ్యమా? తక్కువ జనాభా ఉన్న మారుమూల పల్లెల్లో చేస్తున్నారంటే నమ్మడానికి అర్థం ఉంటుంది. జంగారెడ్డిగూడెంలో ఆ మరణాలన్నీ ఒకే ప్రాంతంలో ఒకే రోజు జరిగినవి కావు. వారం, పది, పదిహేను రోజుల వ్యవధిలో చనిపోయారు. దహన సంస్కారాలు కూడా జరిగిపోయాయి. ఎందుకు చనిపోయారో తెలుసుకునేందుకు దహన సంస్కారాలు పూర్తికాని మృతదేహాలకు పోస్టుమార్టం చేయిస్తున్నాం. 

తెదేపాది గోబెల్స్‌ ప్రచారం

జంగారెడ్డిగూడెం మరణాలపై చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు ఆయనకే అర్థం కావడం లేదు. ప్రజల్ని విపరీతంగా తాగించే కార్యక్రమం చేస్తున్నారని ఆయన అంటున్నారు. ఆ మాట అంటూనే సారా తాగి మనుషులు చనిపోయారని విమర్శిస్తున్నారు. సారా తాగిస్తే ప్రభుత్వానికే ఆదాయం తగ్గిపోతుంది కదా! చంద్రబాబు మాట్లాడే ఒక మాటకు రెండో మాటకు పొంతన లేదు. జరగని ఘటనలను జరిగినట్లు విష ప్రచారం చేస్తున్నారు. ఎంతలా అబద్ధాలను ప్రచారం చేస్తు్న్నారనేదానికి ఈ ఘటనే ఉదాహరణ. ఒక అబద్ధాన్ని పదేపదే నిజమని చెప్తే ప్రజలు నమ్ముతారు అనుకునేలా గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండి సలహాలు ఇస్తే వింటాం. బడ్జెట్‌ చర్చలో పాలుపంచుకుని ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. మంచి విషయాలు ఉంటే నోట్‌ చేసుకుంటాం. అలా కాకుండా సభలో చర్చలే జరగకుండా చేయడం వల్ల ఏమొస్తుంది?’’ అని జగన్‌ ప్రశ్నించారు.   


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని