పయ్యావుల ఆరోపణలు హాస్యాస్పదం: బుగ్గన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు.

Updated : 13 Jul 2021 13:26 IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. తెదేపా సీనియర్‌ నేత, ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పారు. ఆడిట్ సంస్థ ప్రశ్నల ఆధారంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారన్నారు. వైకాపా ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అకౌంటింగ్ వ్యవహారాల్లో తప్పిదాలు జరిగాయని పయ్యావుల ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో బుగ్గన విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. పీఏసీ ఛైర్మన్‌కు అనుమానాలు ఉంటే ప్రభుత్వం నుంచి వివరణ తీసుకోవచ్చన్నారు.  సందేహాలు ఉంటే సమావేశం ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని సూచించారు. లేఖలు రాయడం వల్ల ప్రయోజనమేంటో అర్థం కావడం లేదని ఆక్షేపించారు.

‘‘రూ.41 వేల కోట్లు అవకతవకలు జరిగితే వ్యవస్థలు చూసుకోవా?ఏజీ కార్యాలయం నుంచి వచ్చిన లేఖ చూపి ఆరోపణలు చేయడం శోచనీయం. ఆర్థిక అంశాలపై యనమల మాట్లాడతారు.. ఈసారి పయ్యావుల ఆరోపణలు చేశారు. గవర్నర్‌కు లేఖ, మీడియా సమావేశాలు ఇలా ఇన్ని విమర్శలేంటో అర్థం కావడం లేదు. రూ.41 వేల కోట్ల బిల్లుల చెల్లింపులపై ఆడిట్‌ సంస్థ వివరణ కోరింది. ఏజీ కార్యాలయానికి అన్ని వివరాలు ఇస్తాం. ఈ వ్యవహారానికి సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థ కారణం.. చెల్లింపులన్నీ కేంద్రీకృతం కావడమే. 2018లో సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థను మొదలుపెట్టింది తెదేపా ప్రభుత్వమే. ఈ వ్యవస్థను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టారు’’ అని బుగ్గన అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని