AP High Court: స్కిల్‌ కేసులో చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు బెయిల్‌ మంజూరైంది.

Updated : 20 Nov 2023 15:19 IST

అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేస్తూ జస్టిస్‌ టి.మల్లికార్జున్‌రావు తీర్పు వెల్లడించారు. ఈ నెల 28న రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. మధ్యంతర బెయిల్‌ మంజూరు సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని.. 29వ తేదీ నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో చంద్రబాబు పాల్గొనవచ్చని న్యాయమూర్తి తెలిపారు. అయితే, ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలని ఆదేశించారు. చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

‘‘సాక్షులను ప్రభావితం చేస్తారన్న ప్రాసిక్యూషన్‌ వాదనకు ఎలాంటి ఆధారాల్లేవు. నిధులు విడుదల చేసినంత మాత్రాన నేరంలో పాత్ర ఉందని చెప్పలేం. చంద్రబాబు, తెదేపా ఖాతాకు నిధులు మళ్లింపుపై ఆధారాలు లేవు. ప్రతి ఉపగుత్తేదారు తప్పులకు సీఎంను బాధ్యుడిని చేయలేం. ఉల్లంఘనలపై అధికారులు సీఎంకు చెప్పినట్లు ప్రాథమిక ఆధారాలు లేవు. ఈ కేసు విచారణ మొదలయ్యాక 22 నెలలు చంద్రబాబు బయటే ఉన్నారు. కొద్ది రోజుల ముందే కేసు నమోదు చేసి చంద్రబాబును అరెస్టు చేశారు. విచారణ కాలంలో కేసును ప్రభావితం చేశారనేందుకు ఒక్క ఆధారం లేదు. ఆయన జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఎన్‌ఎస్‌జీ భద్రతలో ఉన్నారు. కేసు విచారణ నుంచి ఆయన తప్పించుకునే అవకాశమే లేదు. కేసు విచారణకు చంద్రబాబు విఘాతం కలిగించే అవకాశం లేదు. సీమెన్స్‌ డైరెక్టర్‌, డిజైన్‌టెక్‌ యజమాని వాట్సప్‌ సందేశాలకు, చంద్రబాబుకు సంబంధం ఏంటి? చంద్రబాబు లాయర్ల వాదనలతో అంగీకరిస్తున్నాం’’ అని తీర్పు వెల్లడి సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. 

వాదనలు కొనసాగాయిలా..

రాజకీయ పెద్దలు చెప్పినట్లు ఏపీ సీఐడీ నడుచుకుంటోందని చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు గురువారం వాదనలు వినిపించారు. పోలీసులు చట్టానికి విధేయులై ఉండాలి తప్ప రాజకీయ నేతలకు కాదని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ దురుద్దేశపూర్వకంగా, రాజకీయ కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేశాయని, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. వాస్తవాలను దాచిపెట్టి అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. వృత్తి విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున బార్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయవచ్చు గానీ, తాము ఆ పని చేయట్లేదని తెలిపారు.

సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘లొంగిపోయేటప్పుడు రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌కు సీల్డ్‌కవర్లో వైద్యనివేదికలు అందజేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్‌ ఉల్లంఘించారు. ఆ నివేదికలు నమ్మశక్యంగా లేవు. బెయిల్‌ మంజూరుకు వాటిని పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు. ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించాలి. మధ్యంతర బెయిల్‌ పొందిన చంద్రబాబు.. హైదరాబాద్‌ వెళ్లి ర్యాలీ నిర్వహించి, కోర్టు షరతులను ఉల్లంఘించారు. బేగంపేట పోలీసులు ఆయనపై కేసు నమోదుచేశారు. ఈ కేసులో ఇతర నిందితులకు బెయిల్‌ మంజూరయిందన్న కారణంతో పిటిషనర్‌కు బెయిల్‌ ఇవ్వాలని న్యాయవాదులు కోరడం సరికాదు. అందువల్ల బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేయాలి’ అని కోరారు. ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు.. తాజాగా బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని