Vangalapudi Anitha: జగన్‌పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేయండి: ఏపీ హోంమంత్రి అనిత

రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి జరగాలని సింహాద్రి అప్పన్న స్వామిని కోరుకున్నానని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

Updated : 17 Jun 2024 19:22 IST

సింహాచలం: రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి జరగాలని సింహాద్రి అప్పన్న స్వామిని కోరుకున్నానని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సింహాచలంలో స్వామి వారిని ఆమె దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అనిత మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత అప్పన్న స్వామిని దర్శించుకోవాలని ఇక్కడికి వచ్చానని తెలిపారు. సింహాచలం దేవస్థానం భూములు ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తానన్నారు. పంచగ్రామాల భూ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని చెప్పారు.

వైకాపా ప్రభుత్వంలో కొంతమంది పోలీసు అధికారులు ఆ పార్టీ నేతలకు తొత్తులుగా పనిచేశారని అనిత విమర్శించారు. ఇప్పటికీ వారిలో వైకాపా రక్తం ప్రవహిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. జగన్‌పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పార్టీ కోసం పనిచేసుకోవాలని హితవు పలికారు. శాంతిభద్రతల విషయంలో ఎవరు తప్పుచేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరగకుండా చూస్తానని తెలిపారు.

పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి సమీక్ష  

విశాఖ పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘వైకాపా పాలనలో రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్‌ హబ్‌గా మార్చారు. కనీసం పోలీస్‌స్టేషన్ల నిర్వహణకు కూడా నిధులు ఇవ్వలేదు. గంజాయి అణచివేతకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తాం. విశాఖలోనే గంజాయి అక్రమ రవాణాపై 1252 మందిపై కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి 300 మందిపై కేసులున్నాయి. గంజాయి నివారణకు ప్రజా సహకారం కూడా కావాలి. ప్రజలకు మంచి చేసే దృక్పథంతో పోలీసులు ఉండాలి. మూడు నెలల్లోనే వ్యవస్థను గాడిలో పెడతాం. పోలీసు శాఖలో భారీ స్థాయిలో ప్రక్షాళన ఉంటుంది.’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని