Amarnath: హరీశ్‌రావు, కేసీఆర్‌కు మధ్య గొడవలుంటే వాళ్లు చూసుకోవాలి: మంత్రి అమర్నాథ్‌

కేసీఆర్‌, తెరాసను చూసి నేర్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి తమకు లేదని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. 

Updated : 30 Sep 2022 16:44 IST

విశాఖపట్నం: మంత్రి హరీశ్‌రావు, సీఎం కేసీఆర్‌కు మధ్య గొడవలు ఉంటే వాళ్లు వాళ్లు చూసుకోవాలి కానీ ఆంధ్రప్రదేశ్‌పై విమర్శలు చేయడం సరికాదని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మండిపడ్డారు. తెలంగాణ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి.. తెలంగాణకు ఎనిమిదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్‌ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. హరీశ్‌రావు జగన్‌ను తిడితే.. మేం ఇక్కడ కేసీఆర్‌ను తిడతాం అది చూసి హరీశ్‌ హ్యాపీ ఫీలవుదామన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్న పేదలకు ఎలాంటి సంక్షేమం అందుతుందో, ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందో ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. కేసీఆర్‌, తెరాసను చూసి నేర్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి తమకు లేదన్నారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణలో జరిగిన సంక్షేమం, వైకాపా అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఏపీలో జరిగిన సంక్షేమం గురించి చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల కేటీఆర్‌ ఉదయం విమర్శ చేసి రాత్రికి వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. ఏపీ భవన్‌లో అధికారిని హరీశ్‌రావు ఎలా తన్నారో అందరూ చూశారని మంత్రి అమర్నాథ్‌ అన్నారు.  

ఉపాధ్యాయుల పట్ల ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నిన్న జరిగిన తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో మాట్లాడిన హరీశ్.. తెరాస ప్రభుత్వం ఉపాధ్యాయులతో ఎంత స్నేహపూర్వకంగా ఉందో గమనించాలని సూచించారు. ఏపీలో ఉపాధ్యాయులను కేసులు పెట్టి లోపల వేస్తున్నారని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని