అధికారులను ఎదురించి.. ఓటు హక్కు..!

ఓటు వేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ పోలింగ్‌ ముందురోజు నుంచే ఆ గ్రామాల్లో ఆంక్షలు విధించారు. ఎవరూ కూడా ఓటువేయడానికి వీళ్లేదంటూ రహదారులు మూసివేశారు. భారీగా పోలీసులను మొహరించారు....

Published : 09 Apr 2021 12:48 IST

గిరిజన గ్రామాల్లో వెల్లివిరిసిన చైతన్యం

ఇంటర్నెట్ డెస్క్‌: ఓటు వేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ పోలింగ్‌ ముందురోజు నుంచే ఆ గ్రామాల్లో  అధికార యంత్రాంగం ఆంక్షలు విధించింది. ఎవరూ కూడా ఓటు వేయడానికి వీల్లేదంటూ రహదారులు మూసివేశారు. భారీగా పోలీసులను మోహరించారు. ఓటు వేసేందుకు వెళుతున్న మహిళలతో దారుణంగా ప్రవర్తించారు. అయినా ఆ గిరిజనులు పోరాడారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కొండలు, గుట్టలు దాటి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

విజయనగరం జిల్లా సాలూరు మండలంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు వివాదంలో 21 కొటియా గ్రామాలున్నాయి. కరోనా వ్యాప్తిని సాకుగా చూపించి కొటియా గ్రామాల్లో ఒడిశా ప్రభుత్వం బుధవారం రాత్రికి రాత్రే ఆంక్షలు విధించింది. కొన్ని గ్రామాల్లో కొవిడ్‌ కేసులు నమోదు కావడంతో.. వైరస్‌ విస్తరించకుండా చర్యలు చేపడుతున్నట్లు లేఖ విడుదల చేసింది. గంజాయిభద్ర నుంచి వచ్చే దారులను మూసివేసి పోలీసులు, అధికారులు వివాదాస్పద గ్రామాలకు చేరుకున్నారు. వీరితోపాటు ఒడిశాకు చెందిన రాజకీయ పార్టీల నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా అక్కడికి వచ్చారు. ఆ గ్రామాల్లోనే గిరిజనులను నిర్బంధించారు. ఎవరు కూడా ఏపీ పరిషత్‌ ఎన్నికల్లో ఓటు వేయడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. రహదారులకు అడ్డంగా రాళ్లు వేశారు.

గంజాయిభద్ర పంచాయతీ ఓటర్ల కోసం వివాదాస్పద గ్రామాల్లో ఒకటైన నేరెళ్లవలసలో పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు. ఆ పంచాయతీ పరిధిలోని ఎగువ గంజాయిభద్ర, దిగువ గంజాయిభద్ర, ఎగువ సెంబి, దిగువ సెంబి, భూభద్ర, పనుకులోవ తదితర గ్రామాల్లో ఉదయం 8 గంటల వరకు కేవలం ఏడుగురే ఓటేశారు. ఓటు వేసేందుకు వచ్చినవారిపై ఒడిశా పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు. పోలీసు బలగాలు, స్థానికులకు మధ్య తోపులాటలు జరిగి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఒడిశా ప్రభుత్వం అడ్డగింతపై సమాచారం అందుకున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధికారులు కొటియా గ్రామాల్లోకి వెళ్లారు. కానీ వారిని కూడా ఒడిశా పోలీసులు అడ్డుకోవడంతో వివాదం తారస్థాయికి చేరింది. ఏపీ పరిధిలోని గ్రామాల్లో ఓటింగ్‌ జరగకుండా అడ్డుకోవడానికి మీరెవరంటూ, ఓటర్లను అడ్డుకనే అధికారం లేదని పోలీసులతో అధికారులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఒడిశా అధికారులు వెనక్కి తగ్గారు. అదే సమయాల్లో వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఓటర్లు వెళ్లేందుకు అనుమతించేది లేదంటూ మెలిక పెట్టారు. దీంతో చంటి బిడ్డల తల్లులు ఘాట్‌ రోడ్డులో నడుచుకుంటూ వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని