Andhra News: గొల్లపూడిలో తెదేపా కార్యాలయం తొలగింపు.. దేవినేని ఉమ హౌస్‌ అరెస్ట్

ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెల్లవారుజాము నుంచే పోలీసులు, అధికారులు మోహరించి స్థానిక తెదేపా కార్యాలయాన్ని తొలగించారు.

Updated : 19 Jan 2023 11:26 IST

గొల్లపూడి: ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెల్లవారుజాము నుంచే పోలీసులు, అధికారులు మోహరించి స్థానిక తెదేపా కార్యాలయాన్ని తొలగించారు. తెదేపా ఫ్లెక్సీలు, ఫర్నిచర్, కంప్యూటర్లను తరలించారు. పార్టీ కార్యాలయానికి  బొమ్మసాని సుబ్బయ్య చౌదరి కాంప్లెక్స్ అని బోర్డు ఏర్పాటు చేశారు. బయట రోడ్డుకు ఆనుకుని కూర్చునే పసుపు రంగు బల్లలు సైతం అధికారులు తొలగించారు. పార్టీ కార్యాలయం వైపు ఎవరూ రాకుండా ముందస్తుగా నియంత్రణ చర్యలు చేపట్టారు. ఆ మార్గంలో బారికేడ్లు పెట్టి ఎవర్నీ అనుమతించలేదు. విషయం తెలుసుకున్న పలువురు తెదేపా కార్యకర్తలు, నేతలు అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. తెదేపా కార్యాలయం తొలగింపు నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు చేరుకుని ఆయన బయటకు రాకుండా చేశారు.

గొల్లపూడిలో తెదేపా కార్యాలయ స్థలం లీజుపై గత కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. లీజుదారుడు ఆలూరి చిన్నా, ఆయన కుటుంబసభ్యుల మధ్య వివాదం తలెత్తడంతో హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్థల వివాదం పరిష్కరించుకోవాలని ఆలూరి చిన్నా కుటుంబ సభ్యులకు గత నెల 28న తహసీల్దార్‌ నోటీసులు ఇచ్చారు. ఈ సమస్యను పరిష్కరించుకునేలోపే పార్టీ కార్యాలయాన్ని అక్కడి నుంచి అధికారులు, పోలీసులు తొలగించారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని