Lok Sabha MPs: పంచెకట్టు.. తెలుగులో ప్రమాణం: లోక్‌సభలో ఆకట్టుకున్న ఏపీ, తెలంగాణ ఎంపీలు

Lok Sabha MPs: లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన తెలుగు రాష్ట్రాల ఎంపీలు తెలుగు భాషలో ప్రమాణం చేశారు. కొందరు పంచెకట్టులో సభకు హాజరయ్యారు. 

Updated : 24 Jun 2024 14:03 IST

దిల్లీ: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు (18th Lok Sabha) సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ (AP), తెలంగాణ (Telanagana) రాష్ట్రాల ఎంపీలు తెలుగులో ప్రమాణం చేయడం విశేషం.

తొలుత ఎన్డీయే మంత్రివర్గంలోని కేంద్రమంత్రులు జి.కిషన్‌రెడ్డి (భాజపా), కింజరాపు రామ్మోహన్‌ నాయుడు (తెదేపా), పెమ్మసాని చంద్రశేఖర్‌ (తెదేపా), బండి సంజయ్‌ (భాజపా), భూపతిరాజు శ్రీనివాసవర్మ (భాజపా) తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. మంత్రిమండలి సభ్యుల ప్రమాణం పూర్తయిన తర్వాత ఆంగ్ల అక్షరమాల క్రమం ప్రకారం రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ప్రమాణం చేశారు.

తొలుత ఏపీ ఎంపీల (Andhra Pradesh MPs)కు అవకాశం రాగా.. అందులోనూ కొందరు ఎంపీలు తెలుగులో ప్రమాణం చేశారు. వీరిలో మతుకుమిల్లి శ్రీభరత్‌, కలిశెట్టి అప్పలనాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి, వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్‌ (చిన్ని), లావు శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు. మిగతావారు హిందీ, ఇంగ్లీష్‌లలో ప్రమాణం చేశారు. ఇక, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, తెదేపా ఎంపీ అప్పలనాయుడు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా పంచెకట్టులో తొలిరోజు సభకు హాజరయ్యారు. అంతకుముందు కలిశెట్టి సైకిల్‌పై పార్లమెంట్‌కు రావడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని