Mainpuri bypoll: నేతాజీ ఇలాకాలో.. తోటికోడళ్ల సవాల్‌ ఉండనుందా..?

మైన్‌పురీ లోక్‌సభా నియోజవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు(మైన్‌పురీ, భొగావ్‌, కిశనీ, కర్హల్‌, జస్వంత్‌ నగర్‌) ఉన్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కర్హల్‌, కిశనీ, జస్వంత్‌ నగర్‌ స్థానాలు ఎస్పీ ఖాతాలో పడ్డాయి.

Published : 15 Nov 2022 01:39 IST

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ(SP) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ మృతితో మెయిన్‌పురి లోక్‌సభా నియోజకవర్గం ఖాళీగా మారింది. ఆ స్థానంలో ఎస్పీ అభ్యర్థిగా ఆయన కోడలు, పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ బరిలో నిల్చున్నారు. సోమవారం ఇక్కడి నుంచి నామినేషన్ వేశారు. 1996 నుంచి ఇక్కడ ఎస్పీదే పట్టు. తాజాగా ఆమె ఎంపిక ములాయం వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా పరిగణిస్తున్నారు. అలాగే ఈ ఉప ఎన్నిక వేళ.. పార్టీ క్యాడర్‌నంతా ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నంగానూ భావిస్తున్నారు. ఈ స్థానంలో డిసెంబర్ 5న పోలింగ్ జరగనుంది. ఎనిమిదిన ఫలితం వెల్లడికానుంది. నవంబర్ 17న నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ. ఇక ఇక్కడ భాజపా ములాయం చిన్న కోడలు అపర్ణా యాదవ్‌ను బరిలో దింపే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

మెయిన్‌పురి లోక్‌సభా నియోజవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు(మెయిన్‌పురి, భొగావ్‌, కిశనీ, కర్హల్‌, జస్వంత్‌ నగర్‌) ఉన్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కర్హల్‌, కిశనీ, జస్వంత్‌ నగర్‌ స్థానాలు ఎస్పీ ఖాతాలో పడ్డాయి. మెయిన్‌పురి, భొగావ్‌లో మాత్రం భాజపా విజయం సాధించింది. ‘ఇక్కడి ప్రజలు ములాయంతో ఉద్వేగపూరితమైన సంబంధం కలిగి ఉన్నారు. గతంలో జరిగిన పరిణామాలను వారు పట్టించుకోరు. గతంలో పడని ఓట్లు కూడా ఇప్పుడు వస్తాయి. భాజపాకు వచ్చిన రెండు స్థానాల్లో అభ్యర్థులకు పోలైన ఓట్ల తేడా స్వల్పంగా ఉంది. అన్ని సీట్లు కలిపి చూస్తే.. ఎస్పీదే ఆధిక్యత’ అని ఎస్పీ నేత ఒకరు వెల్లడించారు. భాజపాకు సహకరించేందుకు అభ్యర్థిని నిలబెట్టే పార్టీలన్నింటికీ.. ప్రజలు తగిన సమాధానం ఇస్తారన్నారు. 

ఇక్కడ భాజపా తన అభ్యర్థిని నిలబెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. ఇదిలా ఉంటే.. ఇటీవల అపర్ణా యాదవ్‌ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్‌ ఛౌదరీతో సమావేశమయ్యారు. దాంతో కమలం పార్టీ ఆమెను బరిలో దింపుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల కొద్దిరోజుల ముందు ఆమె భాజపాలో చేరిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ తరఫున అప్పుడు ప్రచారం కూడా నిర్వహించారు. ‘ములాయంజీ వారసత్వానికి అపర్ణ కూడా హక్కుదారే. ఆమెకు ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీ(లోహియా)చీఫ్ శివపాల్‌ యాదవ్‌ మద్దతు కూడా ఉంది. ఇక్కడ అభ్యర్థి భవిష్యత్తును నిర్ణయించేందుకు ప్రగతిశీల్‌ పార్టీ మద్దతు కూడా కీలకమే’ అని భాజపా నేత ఒకరు మీడియాతో వ్యాఖ్యానించారు. ఇంకోపక్క భాజపా యాదవేతర ఓబీసీ అభ్యర్థి(ముఖ్యంగా శాఖ్య వర్గం)ని నిలబెట్టాలన్న ఆలోచనా చేస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ జాబితాలో ఇటావా ఎంపీ రఘురాజ్ సింగ్‌ శాఖ్య, మమ్‌తేశ్‌ శాఖ్య, ప్రేమ్‌ సింగ్‌ శాఖ్య వంటి వారు ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని