Nara Lokesh - Yuvagalam: తెదేపాలో యువోత్సాహం.. లోకేశ్‌ పాదయాత్ర సాగేదిలా..!

నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చే వేదిక యువగళం (Yuvagalam) అంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) జనవరి 27 నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లకు పైగా నడిచేందుకు ఆయన సిద్ధమయ్యారు.

Updated : 26 Jan 2023 20:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: యువత భవితకోసం, ఆడబిడ్డల రక్షణ కోసం, అవ్వాతాతల బాగోగుల కోసం.. దగాపడ్డ వివిధ వర్గాలకు తోడు కోసం అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) శుక్రవారం నుంచి చేపట్టనున్న యువగళం (Yuvagalam) పాదయాత్రకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. రాష్ట్ర అభివృద్ధికి వారధిగా నిలుస్తానంటూ 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లకు పైగా నడిచేందుకు ఆయన సిద్ధమయ్యారు. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకుని కుప్పం చేరుకున్న లోకేశ్‌కు తెదేపా శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చే వేదిక ‘యువగళం’ అంటూ నారా లోకేశ్‌ రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దాదాపు 125కు పైగా  నియోజకవర్గాల్లో లోకేశ్‌ పాదయాత్ర సాగనుంది. 27న ఉదయం 11 గంటల 3 నిమిషాలకు కుప్పం నియోజకవర్గం పరిధిలోని లక్ష్మీపురం వరదరాజస్వామి ఆలయం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఉదయాన్నే ఆలయానికి చేరుకోనున్న లోకేశ్‌.. అక్కడ ప్రత్యేక పూజలు చేసి నిర్దేశించుకున్న ముహూర్తానికి తొలి అడుగు వేయనున్నారు. సాయంత్రం కుప్పంలో జరిగే భారీ బహిరంగ సభలో లోకేశ్‌ పాల్గొంటారు. లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభఘట్టాన్ని పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి ఈ బహిరంగసభకు హాజరయ్యేందుకు తెలుగుదేశం శ్రేణులు సిద్ధమయ్యాయి. దాదాపు 50వేల మందికి పైగా కార్యకర్తలు  బహిరంగసభకు హాజరవుతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పొలిట్‌బ్యూరో సభ్యులు నందమూరి బాలకృష్ణతో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా దాదాపు400 మంది పార్టీ సీనియర్‌ నేతలు బహిరంగ సభ వేదికపై ఆశీనులయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ సీనియర్‌ నేతలు రామానాయుడు, కళా వెంకట్రావు, ఎమ్మెల్సీలు సత్యనారాయణరాజు, అంగర రామ్మోహన్‌, చిత్తూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు పులవర్తి నాని తదితరులు బహిరంగసభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

తొలిరోజు యాత్ర సాగేదిలా..

శుక్రవారం ఉదయం లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న లోకేశ్‌ అక్కడి నుంచి ఓల్డ్‌పేట్‌ వెళ్లనున్నారు. స్థానిక మసీదులో ప్రార్థనలు చేసి ముస్లిం మైనారిటీ నేతలతో సమావేశమవుతారు. కుప్పం బస్టాండ్‌, పార్టీ కార్యాలయం, ట్రాఫిక్‌ ఐల్యాండ్‌ జంక్షన్‌, కుప్పం ప్రభుత్వాసుపత్రి క్రాస్‌, శెట్టిపల్లి క్రాస్‌ల మీదుగా పీఈఎస్‌ కళాశాల వరకు తొలిరోజు పాదయాత్ర సాగనుంది. 28న పీఈఎస్‌ కళాశాల నుంచి శాంతిపురంలోని అరిముతనపల్లి వరకు సాగనుంది. ఈనెల 29న శాంతిపురం మండలంలోని అరిముతనపల్లి నుంచి చెల్డిగానిపల్లె వరకు జరగనుంది. కుప్పంలో 29 కిలోమీటర్ల మేర 3 రోజుల పాటు లోకేశ్‌ పాదయాత్ర జరగనుంది. తర్వాత పలమనేరు నియోజకవర్గలోకి వెళ్లనున్న యాత్ర.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తంగా నెల రోజులపాటు సాగనుంది. లోకేశ్‌ 400 రోజుల పాదయాత్ర అనుమతులపై డీజీపీ కార్యాలయం ఇప్పటి వరకు స్పందించకపోగా .. జిల్లా యంత్రాంగం మాత్రం తొలి 3 రోజులకు మొత్తం 29 షరతులు విధించింది. లోకేశ్‌ పాదయాత్రను అడ్డుకునే కుట్రను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తెలుగుదేశం నేతలు తేల్చి చెబుతున్నారు. 

ప్రతి నియోజకవర్గంలో 3 రోజులు పాదయాత్ర ఉండేలా ప్రణాళిక

కుప్పం నుంచి ప్రారంభం కానున్న మహాపాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు సాగనుంది. ప్రతి నియోజకవర్గంలో 3 రోజుల పాటు లోకేశ్‌ పాదయాత్ర ఉండేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఒక్కో నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ పెట్టనున్నారు. ఏడాదికి పైగా సాగే ఈ పాదయాత్రలో వీలైనన్ని ఎక్కువ గ్రామాలను చుట్టనున్నారు. నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధాన అజెండాగా సాగే పాదయాత్రలో మహిళలు, రైతులు, వివిధ వర్గాల వారి సమస్యలను చర్చించి ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నారు. ఇందులో యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయనున్నారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున వచ్చిన యువత సమస్యలు తెలుగుదేశం అధ్యయనం చేసింది. యువగళం వేదికను రాష్ట్ర యువతకు పరిచయం చేసి నడిపించే బాధ్యతను అధిష్ఠానం లోకేశ్‌కు అప్పగించింది. రాష్ట్రంలో 1.50కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని అంచనా వేశారు. నిరుద్యోగ సమస్యతో ప్రతి నాలుగు రోజులకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు గుర్తించారు. రాష్ట్రంలో యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువగళం వినిపించాలని లోకేశ్‌ నిర్ణయించారు. 96862 96862 కి మిస్డ్ కాల్ ఇచ్చి యువగళంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేసుకున్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు