Gujarat Assembly Polls: ఆర్టికల్‌ 370 రద్దు కాంగ్రెస్‌తో సాధ్యమయ్యేదా?: యోగి ఆదిత్యనాథ్‌

ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే.. ఆర్టికల్‌ 370 రద్దు జరిగేదా? అని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. ఆయోధ్యలో రామమందిర నిర్మాణం కూడా ఓ కలగానే మిగిలిపోయేదని వ్యాఖ్యానించారు.

Published : 19 Nov 2022 02:21 IST

వాంకనీర్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో అధికారాన్ని కొనసాగించేందుకు భాజపా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి అంశాన్నీ తనకు అనుకూలంగా మలచుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ ఎన్నికలకు స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే ఆర్టికల్‌ 370 రద్దు సాధ్యమయ్యేదా? అని ప్రశ్నించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కూడా ఓ కలగానే మిగిలిపోయేదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం వల్లే అయోధ్యలో సర్వాంగ సుందరంగా రామమందిరాన్ని నిర్మించుకుంటున్నామని చెప్పారు.

గుజరాత్‌లోని మోర్బీ జిల్లా వాంకనీర్‌ నియోజవర్గ అభ్యర్థి జిటు సోమనికి మద్దతుగా ఆదిత్యనాథ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిందని గుర్తు చేశారు. దీనివల్ల ఉగ్రవాద కార్యకలాపాలు అనూహ్యంగా తగ్గిపోయాయని, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. ‘‘ ఉగ్రవాదానికి ప్రధాన కారణమైన ఆర్టికల్‌ 370ని ప్రధాని మోదీ, హోం మంత్రి హోం అమిత్‌ షా రద్దు చేశారు. ఇది కాంగ్రెస్‌ వల్ల సాధ్యమయ్యే పనేనా?’’అని యోగి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని రక్షించలేదని, అలాగని ప్రజల అభిమానాన్ని కూడా పొందలేదని ఆదిత్యనాథ్‌ ఎద్దేవా చేశారు.

భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీని నిర్వీర్యం చేయాలని మహాత్మాగాంధీ చెప్పారని గుర్తు చేస్తూ.. ఆయన కోరిక నెరవేరే సమయమొచ్చిందని యోగి వ్యాఖ్యానించారు. త్వరలో దేశ వ్యాప్తంగా ఆ పార్టీ తుడిచిపెట్టుకు పోతుందని అన్నారు. భాజపా పని తీరు చూస్తుంటే మోర్బీ, వాంకనీర్‌ నియోజకవర్గాల్లో భాజపా రికార్డు స్థాయి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ప్రధాని మోదీ అడుగుజాడల్లో గుజరాత్‌ మాదిరిగానే ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ అభివృద్ధి పరుగులు పెడుతోంది. అయోధ్యలో రామమందిరాన్ని మీరంతా తప్పకుండా చూడాలి. కాశీవిశ్వనాథ ఆలయాన్ని దర్శించాలి. ఆ పుణ్యక్షేత్రం ఎంతలా అభివృద్ధి చెందిందో అప్పుడే అర్థమవుతుంది. అందుకే మోదీ ఉన్నచోట.. సాధ్యకానిది ఏదీ ఉండదు’’ అని ఆదిత్యనాథ్‌ అన్నారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని 182 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో డిసెంబరు 1, 5 తేదీల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని