Election Results 2022: ‘ఇక కేజ్రీవాల్‌ దేశాన్ని ముందుకు నడిపిస్తారు’

పంజాబ్‌లో ఆప్ ఫలితాలపై స్పందిస్తూ ఆ పార్టీ నేత రాఘవ్‌ చద్దా కీలక వ్యాఖ్యలు చేశారు....

Updated : 10 Mar 2022 12:25 IST

పంజాబ్‌ ఫలితాల నేపథ్యంలో ఆప్‌ నేత చద్దా కీలక వ్యాఖ్యలు

దిల్లీ: ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగానే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా, పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నాయి. అయితే, ఆప్ దిల్లీ వెలుపల తొలిసారి అధికారం చేపట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఆ పార్టీ నేతలు సంబరాల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా ఆ పార్టీ కీలక నేత రాఘవ్‌ చద్దా ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆప్‌ ఓ జాతీయ శక్తిగా అవతరించిందని చద్దా వ్యాఖ్యానించారు. కేంద్ర రాజకీయాల్లో కాంగ్రెస్‌ స్థానాన్ని ఆప్‌ భర్తీ చేయనుందని చెప్పుకొచ్చారు. ఓ రాజకీయ పార్టీగా ఆప్‌నకు ఇది అద్భుతమైన రోజుగా అభివర్ణించారు. తమ పార్టీ ఇక ఏమాత్రం ప్రాంతీయ పార్టీ కాదన్నారు. భగవంతుండి ఆశీస్సులతో తమ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓ రోజు ఈ దేశాన్నే ముందుకు నడిపించాలని కోరుకుంటున్నామన్నారు. పరోక్షంగా కేజ్రీవాల్‌ ప్రధానమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు.

భాజపా ఏర్పాటైన తర్వాత రెండు సీట్లు గెలవడానికి చాలా సమయం తీసుకుందని చద్దా గుర్తుచేశారు. కానీ, ఆప్‌ పనితీరు మాత్రం అందుకు భిన్నంగా ఉందన్నారు. తమ పార్టీ 2012లోనే ఏర్పాటైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కేజ్రీవాల్‌ పాలన ఎలా ఉంటుందో ప్రజలు చూశారన్నారు. పంజాబ్‌లోనూ అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు. ఐదు దశాబ్దాలుగా కనీస వసతులు కూడా ఏర్పాటు చేయని పార్టీలను దూరం పెట్టారన్నారు. వారికి ఓటర్లంతా ఓ గుణపాఠం చెప్పాలనుకున్నారని చద్దా వ్యాఖ్యానించారు.

ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలననుసరించి పంజాబ్‌లో ఆప్‌ సగానికి పైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ హవా ముందు ఇతర పార్టీల కీలక నేతలు సైతం వెనుకంజలో ఉండడం గమనార్హం. సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ, నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ, అకాలీదళ్‌కు చెందిన ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ వంటి దగ్గజ నేతలు ఆప్‌ అభ్యర్థుల కంటే వెనుకంజలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని