Arvind Kejriwal: ఎన్ని బూటకపు విచారణలు ప్రారంభించినా తలవంచను : కేజ్రీవాల్‌

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ (Arvind Kejriwal).. అధికారిక నివాసం మరమ్మతుల్లో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ (CBI) ప్రాథమిక దర్యాప్తు (Preliminary Enquiry) ప్రారంభించింది. దీనిపై కేజ్రీవాల్‌ స్పందించారు.

Published : 28 Sep 2023 18:48 IST

దిల్లీ : దిల్లీ (Delhi) ముఖ్యమంత్రి నివాసం ఆధునికీకరణ పనులపై అవినీతి ఆరోపణలు రావడంతో సీబీఐ (CBI) ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పందించారు. సీబీఐ విచారణను స్వాగతిస్తున్నానని చెప్పిన ఆయన.. దర్యాప్తు సంస్థ ఏమీ కనుగొనలేదని అన్నారు. అక్రమ కేసుల విచారణ ఎదుర్కోవడం తనకు కొత్తేమీ కాదన్నారు. ‘ఎన్ని నకిలీ విచారణలు ప్రారంభించినా కేజ్రీవాల్‌ ఎవరి ముందూ తలవంచరని’ చెప్పారు. ఒక వేళ సీబీఐ విచారణలో క్లీన్‌ చిట్ వస్తే ప్రధాని నరేంద్రమోదీ తన పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. 

రంపం పట్టిన రాహుల్‌.. వడ్రంగి పనివారితో చిట్‌చాట్‌

‘సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభించడం చూస్తే ప్రధాని ఎంత ఆందోళనగా ఉన్నారో అర్థమవుతోంది. ఇదేమి నాపై చేపడుతున్న తొలి విచారణ కాదు. ఇప్పటికే 50కి పైగా విచారణలు ప్రారంభించారు. కొన్నిసార్లు మద్యం పాలసీలో అవినీతి జరిగిందని చెబుతారు. కొన్ని సార్లు బస్సులు, స్కూళ్లు, రోడ్ల నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని అంటారు. నాపై 33కు పైగా కేసులు పెట్టారు. నేను దిల్లీకి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎనిమిదేళ్లుగా విచారణ చేస్తూనే ఉన్నారు. కానీ, ఏమీ తేల్చలేకపోయారు. ఇప్పుడు మరో కొత్త విచారణ మొదలుపెట్టారు. దీన్ని కూడా స్వాగతిస్తున్నా. ఇందులోనూ ఏమీ కనుగొనలేరని’ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. 

ప్రజలు కొవిడ్‌ మహమ్మారితో పోరాడుతున్న సమయంలో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ తన నివాసం ఆధునికీకరణ పేరుతో రూ.45 కోట్లు ఖర్చు చేశారని దిల్లీ భాజపా అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆరోపించారు. ఈ ఆరోపణల గురించి నివేదిక ఇవ్వాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా సీఎస్‌ను ఆదేశించారు. దిల్లీ ప్రభుత్వం ఆధ్వరంలోని పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ చేపట్టిన నిర్మాణ పనుల్లో కొన్ని ఉల్లంఘనలు జరిగాయని సీఎస్‌ గవర్నర్‌కు నివేదిక అందజేశారు. దాని ఆధారంగా విచారణ చేపట్టాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా సీబీఐకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ప్రాథమిక విచారణ ప్రారంభించిన సీబీఐ అక్టోబరు 3లోగా పనులకు సంబంధించిన దస్త్రాలన్నింటినీ తమ ముందు ఉంచాలని పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ను బుధవారం ఆదేశించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని