Gujarat: యోగి X కేజ్రీవాల్‌.. ట్విటర్‌ వేదికగా ప్రచార విమర్శలు!

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది గుజరాత్‌లో ప్రచార వేడి పెరుగుతోంది. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆప్‌ అధినేత, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌లు శనివారం ట్విటర్‌ వేదికగా పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు.

Published : 27 Nov 2022 01:36 IST

గాంధీనగర్‌: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది గుజరాత్‌(Gujarat)లో ప్రచార వేడి పెరుగుతోంది. భాజపా, కాంగ్రెస్‌, ఆప్‌ ఇతరత్రా పార్టీల నేతలు తమదైన ప్రచార శైలిలో ప్రజల్లో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath)‌, ఆప్‌ అధినేత, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)లు తాజాగా ట్విటర్‌ వేదికగా పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. భాజపా స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉన్న యోగి ఆదిత్యనాథ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగిస్తూ.. దిల్లీనుంచి వచ్చిన ఓ ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP) వ్యక్తి వాస్తవానికి ఉగ్రవాద సానుభూతిపరుడని కేజ్రీవాల్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.

అవినీతి, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. పాకిస్థాన్‌లో భారత సైన్యం జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌పైనా ఆధారాలు అడిగినట్లు విమర్శించారు. అనంతరం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఆదిత్యనాథ్‌.. ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దీనిపై కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. ‘ఒకవేళ గుజరాత్‌లో గూండాయిజం, అవినీతి, మకిలీ రాజకీయాలు కావాలంటే వారి(భాజపా)కి ఓటేయండి. అదే.. పాఠశాలలు, ఆస్పత్రులు, విద్యుత్, నీటి సదుపాయం, రోడ్లు కావాలంటే నాకు ఓటు వేయండి’ అని ఓటర్లను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. గుజరాత్‌లో డిసెంబరు 1, 5వ తేదీల్లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే. డిసెంబరు 8న ఫలితాలను వెల్లడించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని