uttar pradesh election: ఎస్పీతో పొత్తు.. అవాస్తవం: ఏఐఎంఐఎం

వచ్చే ఏడాది జరగబోయే ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)తో తమ పార్టీ పొత్తుపై వస్తున్న వార్తలను ఏఐఎంఐఎం తోసిపుచ్చింది.

Updated : 25 Jul 2021 18:20 IST

హైదరాబాద్‌: వచ్చే ఏడాది జరగబోయే ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)తో తమ పార్టీ పొత్తుపై వస్తున్న వార్తలను ఏఐఎంఐఎం తోసిపుచ్చింది. రాష్ట్రంలో అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఎస్పీ అధికారంలోకి వస్తే తమ పార్టీకి చెందిన నేతకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే షరతుపై పొత్తుకు అంగీకరించినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏఐఎంఐఎం ఉత్తర్‌ప్రదేశ్‌  అధ్యక్షుడు షౌకత్‌ అలీ ఆదివారం వెల్లడించారు. తమ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ సహా తామెవ్వరూ అలాంటి ప్రకటన చేయలేదని తెలిపారు. గత ఎన్నికల్లో ఎస్పీకి 20 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. అయినా అధికారం చేపట్టిన తర్వాత ఉపముఖ్యమంత్రి పదవిని ముస్లిం నేతకు ఇవ్వలేదని ఆయన చెప్పారు.

రానున్న ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 100 స్థానాల్లో పోటీ చేస్తుందని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ గతంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన లఖ్‌నవూలోనూ పర్యటించారు. ఎన్నికలకు సంబంధించి పలు రాజకీయ పార్టీల నేతలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం చిన్న పార్టీల కూటమిగా ఏర్పడ్డ బాఘీదారీ సంకల్ప్‌ మోర్చాలో చేరారు. ఎస్‌బీఎస్‌పీ నేత ఓంప్రకాశ్ రాజ్‌భర్‌, పీఎస్పీ నేత శివపాల్‌ సింగ్‌ యాదవ్‌ సహా పలు పార్టీల నేతలతో ఆయన నిత్యం సమాలోచనలు జరుపుతూనే ఉన్నట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని