Congress: గహ్లోత్‌ ఇంకా అధ్యక్ష రేసులోనే.. చర్యలు ఉండకపోవచ్చు..!

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్ష పదవి బరిలో సీఎం అశోక్‌ గహ్లోత్‌ నిలుస్తారా? లేదా అన్న దానిపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.

Updated : 27 Sep 2022 16:37 IST

దిల్లీ/జైపుర్‌: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్ష పదవి బరిలో సీఎం అశోక్‌ గహ్లోత్‌ నిలుస్తారా? లేదా అన్న దానిపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. పార్టీలో ధిక్కార ధోరణి తలెత్తడంతో ఆయనను అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమటీ సభ్యుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే దీనికి పార్టీ అధిష్ఠానం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. గహ్లోత్‌ వర్గం తిరుగుబాటుతో గాంధీలు అసంతృప్తిగా ఉన్నప్పటికీ అధ్యక్ష పదవికి ఆయనను పోటీ నుంచి తప్పించేందుకు మాత్రం ఆసక్తి చూపించట్లేదట. అంతేగాక, ఆయనపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవట్లేదని సమాచారం.

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి పోటీ నుంచి గహ్లోత్‌ను తప్పించలేదని, ఆయన బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్‌ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతానికి ఆయనపై ధిక్కార చర్యలకు కూడా అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపాయి. ఇక గహ్లోత్‌ వర్గం డిమాండ్‌ చేస్తున్నట్లుగానే అధ్యక్ష ఎన్నికల తర్వాతే రాజస్థాన్‌ తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నట్లు పేర్కొన్నాయి.

ముగ్గురు ఎమ్మెల్యేలకు షోకాజ్‌ నోటీసులు

కాగా.. సీఎం గహ్లోత్‌ నేడు మరోసారి మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరిగిన పరిణామాలు దురదృష్టకరమని, వాటి గురించి తనకు ముందస్తుగా తెలియదని గహ్లోత్‌ చెప్పినట్లు సమాచారం. రాజస్థాన్‌ సంక్షోభ పరిస్థితులపై పార్టీ పరిశీలకులు ఖర్గే, అజయ్‌ మాకెన్‌ రాతపూర్వక నివేదికను నేడు అధ్యక్షురాలు సోనియాగాంధీకి సమర్పించనున్నారు. మరోవైపు, తిరుగుబాటుకు కారణమైన ముగ్గురు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేయనుంది.

ఆ వార్తలు అవాస్తవం: సచిన్‌ పైలట్‌

ఇదిలా ఉండగా.. గహ్లోత్‌ అధ్యక్ష పదవికి పోటీ చేస్తే ఆయనను సీఎం పదవిలో కొనసాగించకూడదని యువనేత సచిన్‌ పైలట్ అధిష్ఠానానికి చెప్పినట్లు మంగళవారం వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను పైలట్‌ ఖండించారు. ‘‘ఇలాంటి అసత్య వార్తలు నన్ను భయపెడుతున్నాయి’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. కాగా.. నేడు ఆయన దిల్లీ చేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని