Published : 15 Feb 2022 14:20 IST

Ashwani Kumar: పంజాబ్‌లో కాంగ్రెస్‌కు షాక్‌.. కేంద్ర మాజీ మంత్రి రాజీనామా

చండీగఢ్‌: పంజాబ్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు.. కాంగ్రెస్‌కు షాక్‌! రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశ్వనీ కుమార్ మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. పార్టీని వీడాలనే నిర్ణయం బాధాకరమని తెలిపారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో తన గౌరవానికి తగ్గట్లుగా.. జాతీయ ప్రయోజనాల కోసం పార్టీ బయటే ఉత్తమ సేవలు అందించగలనని భావిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. పార్టీలో నాయకత్వ లోపాన్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోలేకపోయిందని, క్రమంగా క్షీణిస్తూనే ఉందన్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అయితే దేశ ప్రజల ప్రయోజనాల కోసం క్రియాశీల రాజకీయాల్లోనే ఉంటానని చెప్పారు.

అశ్వనీ కుమార్‌కు కాంగ్రెస్‌తో దాదాపు నాలుగున్నర దశాబ్దాలకుపైగా అనుబంధం ఉంది. యూపీఏ హయాంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. సోనియా గాంధీకి గట్టి విధేయుడిగా పేరుంది. G-23గా పేరొందిన 23 మంది సీనియర్ నాయకులు.. 2020 ఆగస్టులో పార్టీలో భారీ మార్పులకు పిలుపునిస్తూ సోనియాకు లేఖ రాసినప్పుడు ఆయన తమ నాయకురాలికే మద్దతుగా నిలిచారు. ఇటీవల సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఏర్పాటు, గులాం నబీ ఆజాద్‌కు పద్మభూషణ్ తదితర అంశాల చుట్టూ సాగిన వివాదాలు తన రాజీనామా నిర్ణయాన్ని మరింత బలపరిచాయని అశ్వనీ తెలిపారు. పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరునూ తప్పుపట్టారు. రాష్ట్రంలో సీఎం అభ్యర్థిత్వంపై చన్నీ, సిద్ధూలు బహిరంగంగా పోటీ పడటాన్ని ఆయన ప్రశ్నించారు. స్థానికంగా ఆప్‌ గెలవబోతోందని, ప్రాంతీయ పార్టీలు మరింత బలపడటంతో జాతీయ పార్టీగా కాంగ్రెస్ పెద్ద సవాల్‌ ఎదుర్కొంటోందని తెలిపారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని